‘‘నాకే సరిపోవడంలేదు. మీకేం పంపించగలను. నా ఖర్చు తగ్గిందని సంతోషపడండి’’ అన్నాడు కరుణాకర్‌. కొడుకు చెప్పిన మాటను భర్త సత్యమూర్తికి చెప్పింది సుమిత్ర.‘‘అసలు బెంగళూరులో జాబ్‌ చెయ్యడం ఎందుకు? అదేదో హైదరాబాద్‌లో చెయ్యమను’’ అన్నాడు సత్యమూర్తి. ‘‘ఆ మాట మీరే చెప్పండి...’’ అంది సుమిత్ర. దాంతో అతడికి ఏం మాట్లాడాలో అర్థంకాలేదు.‘‘వాడి చదువుకోసం చేసిన అప్పులు ఎవరు తీరుస్తారుట’’ అసహనంగా అన్నాడు సత్యమూర్తి.‘‘మీ గోల మీదే గానీ వాడేంచెబుతున్నాడో వినరేం’’ అంది సుమిత్ర. ‘‘ఏం చెబుతున్నాడు?’’.‘‘వాడి ఫ్రెండ్స్‌సర్కిల్‌లో ఐ.ఐ.టి., ఎన్‌.ఐ.టి చదివినవాళ్లు బెంగుళూరులోనే ఉన్నారట. భవిష్యత్‌లో వాళ్లంతా కలిసి ఒక కంపెనీ పెడతారట. అందుకు బెంగుళూరే సరైన ప్లేస్‌ అని వాడు భావిస్తున్నాడు. చాలీచాలని జీతంతో బ్రతకాలని వాడు అనుకోవడం లేదట...’’.‘‘పైసా కూడా పెట్టుబడి పెట్టలేనివాడు అక్కడ చేసేదేముంటుంది?’’‘‘కంపెనీలో వర్కింగ్‌ పార్టనర్‌ అవుతాడట..’’‘‘ఇంటి సమస్యల పరిష్కారాల్లో మాత్రం పార్టనర్‌షిప్‌ తీసుకోడన్నమాట!’’ వ్యంగ్యంగా అన్నాడు సత్యమూర్తి.‘‘స్వంతంగా ఎదగాలి అన్నది వాడి కల. ఎవరి లక్ష్యాలు వాళ్ళకి ఉంటాయి’’ గొణుగుతున్న భార్యవైపు అదోలా చూశాడు. సత్యమూర్తి ఒక ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు.

కొడుకు చేతికి అందివస్తాడనుకుంటే బెంగళూరు వెళ్ళికూర్చున్నాడు. ఉన్నదంతా ఊడ్చి కూతురుపెళ్ళి చేశాక పేరుకుపోయిన అప్పులు సత్యమూర్తిని భయపెడుతున్నాయి. ఆరునెలలుగా భార్యతో కొడుకుని మాట్లాడిస్తూనే ఉన్నాడు. అయినా కొడుకులో ఇసుమంత కూడా మార్పురాలేదు.జైపూర్‌లో ఎనిమిది నెలలు పనిచేశాక, కనీసం తల్లిదండ్రుల్ని చూడటానికి హైదరాబాద్‌ కూడా రాకుండా, బెంగళూరులో జాబ్‌ వచ్చిందనిచెప్పి అటునుంచి అటే ఫ్లైట్‌లో వెళ్ళిపోయాడు.అక్కడ ఉద్యోగంలో చేరాక ఒక మెసేజ్‌ పారేశాడు. కొడుకు ధోరణి సత్యమూర్తిని మరింత క్రుంగదీసింది. ఆ రాత్రి భార్య ప్రశాంతంగా నిద్రపోతుంటే దిగులుకళ్ళతో గోడకి చేరగిలబడి కూర్చున్నాడు సత్యమూర్తి. అతడి ఆలోచనలు గతంవైపు పరుగులు తీశాయి. కొడుకుని జైపూర్‌లోని అమిటీ యూనివర్సిటీలో చేర్చిన రోజులు గుర్తొచ్చాయి.