‘‘బాబాయిగారు! నాకు కిటికీ దగ్గర సీట్లో కూర్చోవడమంటే భలే ఇష్టం. దయచేసి నేను అక్కడ కూర్చోవచ్చా?’’ ఎంతో మర్యాదగా అడిగాడు భాస్కర్. మనసులో తిట్టుకుంటూ, మొహమాటానికి చేసేదిలేక తన సీటిచ్చారు రాఘవరావుగారు. ‘‘చాలా థాంక్స్ బాబాయిగారు’’ అన్నాడు భాస్కర్. ఓ నిమిషం తరువాత తనకెదురుగాఉన్న అమ్మాయిని ఓసారి పరిశీలనగా చూశాడు. ఆమె సీరియస్‌గా ఏదో పుస్తకం చదువుకుంటోంది. పుస్తకపఠనంలో ఆమెకళ్ళు క్రిందికివాలి ఉన్నాయి. ఆమెవి చాలా అందమైన కళ్ళు అని పసిగట్టేశాడు భాస్కర్. ఇక తన దృష్టిమరల్చి..
***********************
‘‘ప్రయాణికులకు విజ్ఞప్తి,విజయవాడ నుండి హైదరాబాదుకు వెళ్ళవలసిన నంబరు 1116 ఆంధ్రా–తెలంగాణా ఎక్స్‌ప్రెస్ ఒకటవ నంబరు ఫ్లాట్‌ఫారమ్ నుండి బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది’’.అనౌన్స్‌మెంట్ వినబడినాగానీ, ఫ్లాట్‌ఫారమ్‌మీదున్న బుక్‌స్టాల్లో పుస్తకాలుకొనడంలో నిమగ్నమైన భాస్కర్, రైలు కాస్త ఊపందుకున్నాకగానీ అది బయలుదేరినట్టు గమనించలేదు. ఒక్కసారిగా చేతిలో పుస్తకాలను బుక్‌స్టాల్లో విసిరేసి, పరుగెత్తుకుంటూవెళ్ళి ఒక్కుదుటున దొరికిన కంపార్ట్‌మెంట్‌లోకి దూకేశాడు.పిల్లలకు పరీక్షల కాలం కావడంతో, రైలు దాదాపుగా ఖాళీగానే ఉంది. ఎక్కడైనా కిటికీపక్కన సీటు దొరుకుతుందేమో అని వెతుక్కుంటూ వెళ్తున్న భాస్కర్, కిటికీ దగ్గర ఒకసీటులో ఇరవై నుంచి పాతికేళ్ళ మధ్యవయసుగల ఓ అమ్మాయి, ఆమెకు ఎదురుగా అరవై, అరవైఐదేళ్ళున్న ఓ వ్యక్తి కూర్చోవడం గమనించాడు. ఇంకా ముందుకు వెళదామనుకున్నా, అక్కడున్న సహజమైన ఆకర్షణకుగురై, ఆ పెద్దమనిషిపక్కనే కూర్చున్నాడు.
‘‘బాబాయిగారు నమస్కారమండీ! నా పేరు భాస్కర్’’ వినమ్రంగా చేతులుజోడించి తనను పరిచయం చేసుకున్నాడు భాస్కర్.‘‘నమస్కారం బాబూ! నా పేరు రాఘవరావు’’ ఆయన కాస్త అయిష్టంగానే చెప్పారు. రాఘవరావుగారు ముభావంగా ఉండే మనిషి. కలుపుగోలుతనంగా ఉండడం పెద్దగా నచ్చదు. పైగా రైలు ప్రయాణాల్లో ఎవరైనా కలుపుగోలుగా ఉంటున్నారంటే, అదివారి అవసరాలు తీర్చుకోడానికే అని ఆయనకో బలమైన నమ్మకం.‘‘బాబాయిగారు! నాకు కిటికీ దగ్గర సీట్లో కూర్చోవడమంటే భలే ఇష్టం. దయచేసి నేను అక్కడ కూర్చోవచ్చా?’’ ఎంతో మర్యాదగా అడిగాడు భాస్కర్. ‘ఊఁ ఈ అబ్బాయి నమస్కారం అన్నప్పుడే అర్థమైంది ఎంత స్వార్థపరుడో. అయినా, రైలంతా ఖాళీగా ఉన్నప్పుడు ఇంకోచోట కూర్చోవచ్చుగా’ ఇదే విషయం అడుగుదామనుకున్నా, అడగలేక మనసులో తిట్టుకుంటూ, మొహమాటానికి చేసేదిలేక తన సీటిచ్చారు రాఘవరావుగారు.