భారతీయ కాలమానంలో ఉత్తరాయణం, దక్షిణాయనం ఉన్నట్లే గోదారోళ్ళ కాలమానంలో పులసాయణం ఒకటుంది. గోదారికి ఎర్రనీరు రావడం ఆలస్యం.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా వంటి దూరదేశాల నుంచి వలస వచ్చే ఇలస చేపలు గోదారిలోకి ప్రవేశించి పులసలుగా మారతాయి. గోదావరి జిల్లాల వాళ్ళకి పులస రావడం అంటే పండగ వచ్చినట్లే. సంక్రాంతికి వచ్చినట్లే పులస లొచ్చినప్పుడూ గోదారోళ్ళ ఇళ్ళకి అతిథులు వస్తుంటారు. ఎందుకంటే, పుస్తెలమ్ముకునైనా కొనుక్కు తినాల్సినంత గొప్పదనం పులసలో ఏముందో తెల్సుకోడానికి! సంక్రాంతికి జరిగే కోడిపందాల్లాగే పులస అనేది ఇక్కడి ప్రజల సంస్కృతిలో ఒకానొక అంతర్భాగం. వలస ప్రయాణంలో రెండు ఇలసల మధ్య సాగే సరదా సంభాషణే ఈ ‘పులసాయణం’.
‘‘అబ్బబ్బా ఇంకా ఎంతసేపు ఈదాలో!వాజాలు నొప్పెటేస్తన్నాయంటే నమ్ము, అసలే ఒట్టి మనుషులం కూడా కాదు.. ఆ మగరాయుళ్ళలా జాంజామ్మంటూ ఈదుకు పోడానికి! ఇంతకీ ఇండియా దరిదాపులకన్నా వచ్చామంటావా?’’ అంది ఇలసక్కతో ఇలసమ్మ.‘‘ఆ... అప్పుడేనా? ఇందాకేగా! ఇండోనేష్యా దాటాం, ఇంకా బర్మా దాటాలి, అండమాన్ సేరాలి. అప్పుడు కదా ఇండియా దరిదాపుకి వచ్చినట్టు’’ అంది ఇలసక్క చుట్టూతాపరిశీలిస్తూ.‘‘ఐనా రోజులెంత మారిపోయినియ్యే! ఒకప్పుడు న్యూజీలాండులో బయల్దేర్టం మొదలు ఇండియా సేరీదాక మద్ది, మద్దెలో సముద్రంలో కల్సీ నదుల నీల్లరంగు బట్టయితే ఏటీ? అక్కడక్కడా తగిలీ పగడాల దీవులు గట్రా బట్టయితే ఏటీ? ఎంతదాకా వచ్చాం? ఎక్కడకి సేరాం అనీది మనకిట్టే తెల్సిపోయీది.
ఇప్పుడా? మనవే బూగోళసాత్త్రం మర్సిపోయామో? లేక ఆ మాయదారి మడుషులు ఈ సముద్రాల్లో ఏమేం కలిపి సత్తన్నారో కానీ.. నీళ్ళలో మునుపున్న రంగూ ఉంటం లేదు, రుసీ ఉంటం లేదు. ఎంతదాకా వచ్చేమో తెల్డానికి అంతమాటూ తడుము కోవాల్సొత్తంది’’ అంటా తన పక్కనుంచి నీటి అడుక్కి పోతున్న ఏదో రంగు రంగుల కాయితాన్ని నోటితో పట్టుకోబోయింది ఇలసక్క.అది సూసిన ఇలసమ్మ ఎంటనే కంగారుపడి పోయి ‘‘ఒసేయ్! ఆగాగు. అదేటనుకున్నావ్! మిలమిలా మెరుత్తంది కదాని నోట్లో ఎట్టేసు కుంటన్నావ్? దాన్ని ప్లాస్టిక్ సంచంటారు. అది కానీ మింగావంటే ఈ యేడు ఇండియా సూడకుండానే ఇక్కడే గుటుక్కుమంటావ్’’ అంటూ ఇలసక్కని పక్కకి లాగింది.