‘కత్తి’... ‘తాడు’... ‘తుపాకీ’... ‘విషం’...నాలుగు కాగితమ్ముక్కల్లో విడివిడిగా ఈ నాలుగు ముక్కలూ రాశాను.. ఆ చీటీలను గుండ్రంగా చుట్టాను. నా ఎదురుగా బల్ల మీద చిన్న, పలచటి గాజు కూజా ఉంది. చిన్నతనంలో కిరసనాయిలు బుడ్డి దీపం ఆరిపోకుండా పెట్టే చిమ్నీ లాంటిది... ఈ పోలికకు నవ్వొస్తోంది. ఆ చిమ్నీ అప్పట్లో చీకటిని తరిమేస్తుండేది... చదూకోడానికి! ఇప్పుడు - నన్ను లోపలా బయటా చుట్టేసి ఉన్న చీకటిని చీల్చి చెండాడేస్తుంది ఇది... శాశ్వతంగా!
ఎడమ అరచేతిలో ఆ చిన్ని గాజు కూజాను ఉంచి, కుడి అరచేతిని పైన మూతలాగా పెట్టి... చీటీలు నాలుగూ గుర్తు తెలియకుండా కలిసి పోయేలాగా బాగా కలుపుతున్నాను. దేవుడిని ప్రార్థించాను.‘‘దేవుడా... ఈ నాలుగింటిలో నువ్వు దేనినైనా అనుగ్రహించు... శేషం ఉండని పూర్ణమైన మరణాన్ని ప్రసాదించు...’’ఒక్కటే చీటీ బయటకు తీయాలి. కళ్లు మూసుకుని... అందులో చేయిపెట్టాను.ఫఫఫ‘‘హూ లెట్ ది డాగ్స్ అవుట్...’’ పదివేల వాట్ల స్పీకర్లలో హోరెత్తిపోతోంది. ఫ్లోర్ మొత్తం ప్రకంపనలు పుడుతున్నాయ్. అదిరిపోతోంది. అంత ఉద్ధృతిలో వెధవది.. మానవ దేహం మాత్రం కుదురుగా ఎలా ఉండగలుగుతుంది. ఆడా మగా అందరి శరీరాలూ తైతక్క లాడుతున్నాయ్... కాకపోతే, ఊగుతున్నాయా? తూలుతున్నాయా ఇదమిత్థంగా తేల్చి చెప్పడం కష్టం.
ఏ ఒక్కరూ అయిదో రౌండు కంటె తక్కువలో లేరు. ఆడ దేహాలూ మగ దేహాలూ ఒరుసుకుంటూ ఆడుతోంటే... ప్రతి ఒక్కరికీ ఆవేశం నషాళానికి అంటుతోంది. ఉన్మాదం కమ్మినట్టుగా ఆడుతున్నారు. రాంబాబు సంగతి చెప్పక్కర్లేదు. నలుగురూ చూసేస్తారని... ఇలాంటి వాతావరణంలోకి అడుగుపెట్టడానికి రాంబాబుకు చాలా అడ్డుగోడలు ఉంటాయి. అందుకే ఈ ప్రత్యేకమైన ఏర్పాటు.లాస్ ఏంజిలస్‌లోని ఖరీదైన డ్యాన్స్ బార్ అది. ఆ రాత్రికి ప్రైవేటు పార్టీ కోసం టోకుగా గుత్తకు తీసుకున్నాను. ఉత్సాహాన్ని రాజేయడానికి ఖరీదైన బాటిళ్లున్నాయి. ఎటొచ్చీ బార్ వారి డ్యాన్సింగ్ గాళ్సున్నారు. వారిని తలదన్నే మా నేటివ్ అమెరికన్ యూత్ ఫ్రెండ్సున్నారు. ఇండియన్ తెలుగూ ఆరిజిన్ నుంచి ఉన్న వారు ఇద్దరు ముగ్గురే. ఎందుకంటే రాంబాబు ఇలాంటి యాక్టివిటీ... నలుగురికీ తెలియకూడదనుకుంటాడు. ఓవర్ మౌత్... స్ర్పెడ్ అయిపోతుందని. డేంజర్!