భార్య నందిని, కూతురు మోహన సౌకర్యంగా కూర్చుని ఉన్నారని చూసి కన్‌ఫాం చేసుకున్నాక తన సీట్లో కూలబడ్డాడు శశిధర్‌. మోహన కిటికీలోంచి బయటికి చూస్తోంది. చూసి ఏం ఉద్ధరిస్తుంది? నందిని నిర్లిప్తంగా శూన్యంలోకి చూస్తూ, ఏవో ప్రార్థనలు చేస్తోంది. తను దేని గురించి బెంగపడుతోందో అతనికి తెలుసు. కానీ ఏం చేయగలడు? పేరుకి ఫ్లైట్‌ ఎక్కాడన్న మాటేగానీ, వాళ్ళిద్దరికంటే తనే రెట్టింపు బాధపడుతున్నాడు. ఒక పక్క కూతురు ఆరోగ్యం, మరోపక్క ఆలోచనలు...తన మనసు తనవద్దలేదు. ఈ విషయం తన భార్యకి కూడా తెలియదు. మనసులోని ఆ మథనం గురించి తను బయటికి చెప్పుకోలేడు. తన కూతురు ఆరోగ్యం విషమించడానికి తనే కారకుడా? అనే ప్రశ్నే తనని దహించేస్తోంది.

‘‘సార్‌, మీ అమ్మాయికి ఒక అరుదైన కంటి జబ్బు వచ్చింది. దాని పేరు కార్నియల్‌ డిస్ట్రోఫీ. అంటే కంటికి చూపుని ప్రసాదించే గాజు పరికరం లాంటి కార్నియాలో దుమ్ము, ధూళి పేరుకుపోవడమన్నమాట. అది సాధారణంగా తల్లిదండ్రుల నుంచి సంప్రాపిస్తుంది. ఇక్కడ గమ్మత్తేమిటంటే, మీకుగానీ, మేడమ్‌కు గానీ, ఈ ప్రాబ్లం లేదు, కానీ పాపకి వచ్చింది’’ మెడికల్‌ ఫైల్‌ నా చేతికి అందిస్తూ చెప్పాడు కంటి నిపుణుడు.

దించిన తల ఎత్తకుండా రిపోర్టు కాగితాలనే చూస్తూ, ‘‘నాకు చిన్నప్పుడు వచ్చింది డాక్టర్‌. అప్పట్లో మన దేశంలో ఈ జబ్బుకి ఆపరేషన్‌ చేసేవాళ్ళు లేక లక్షలు ఖర్చుపెట్టి మా నాన్నగారు అమెరికాలో చికిత్స చేయించారు’’ అని జవాబిచ్చి, నందినివంక ఓరచూశాడు. ఆమె ముఖంలో నివ్వెరపాటు! ‘పన్నెండేళ్ళుగా కాపురం చేస్తున్నాగానీ ఇతగాడు ఈ విషయం చెప్పకుండా దాచిపెట్టాడా? ఇప్పుడు నా కూతురికి దృష్టిదోషాన్ని వారసత్వంగా బహూకరిస్తున్నాడా..’ ఆమె మనసులోని భావం ఆమె ముఖంపై ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.