విక్రమార్కుడు తన పట్టుదల వదలలేదు. చెట్టువద్దకు తిరిగి చేరుకున్నాడు. చెట్టెక్కి బేతాళుడు ఆవహించిన శవాన్ని దించి భుజాన వేసుకున్నాడు. ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవాన్ని ఆవహించిన బేతాళుడు, ‘‘రాజా, పరోపకారం చెయ్యడంవల్ల పుణ్యం వస్తుందని కొందరు అనుకోవచ్చు. పుణ్యం కోసమే పరోపకారం చెయ్యాలని మరికొందరు అనుకోవచ్చు. అలాంటివాళ్లు స్వార్థపరులో, అమాయకులో అయి ఉంటారు. నువ్వు స్వార్థపరుడివీ కాదు, అమాయకుడివీ కాదు. అందుకే ఈ అపరాత్రివేళ నీవు పడుతున్న శ్రమ నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే రాముడు, భీముడు అనేవాళ్లు కేవలం పుణ్యం కోసమే పరోపకారం చేసినా, అనూహ్యంగా ప్రతిఫలంపొందారు. నీకూ అలాంటి అదృష్టం కలగాలని కోరుకుంటున్నాను. శ్రమ తెలియకుండా నీకా కథ చెబుతాను విను’’ అంటూ ఇలా చెప్పసాగాడు.

ఒకానొకప్పుడు చంపక దేశానికి రాజు సుధీరుడు. జనక్షేమం, సంక్షేమం ధ్యేయంగా పెట్టుకున్న ఆయన పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండేది. కానీ వరుసగా మూడేళ్లపాటు వానలు పడకపోయేసరికి అక్కడ కూడా కరువొచ్చింది. చివరకు దేశంలో తిండిగింజలు కూడా సరిగ్గా దొరకని పరిస్థితి ఏర్పడి ప్రజలు విలవిలలాడిపోయారు.కలిగినవాళ్లు ఇతర ప్రాంతాలనుంచి తమకి కావాల్సినవి తెప్పించుకుని రోజులు గడుపుతున్నారు. లేనివాళ్లలో కొందరు ఆకులు, అలములు తిని రోజులు వెళ్లబుచ్చుతున్నారు. కొందరు బిచ్చమెత్తుకుని దొరికినపూట తిని, లేనిపూట పస్తులుంటున్నారు. కొందరికి వేరే దారి తోచక, బందిపోట్లుగామారి ధనవంతుల ఇళ్లపై మెరుపుదాడులుచేసి దోచుకోవడం మొదలెట్టారు. అది చూసి మరికొందరు పేదవారు వారిని అనుకరించసాగారు. అలా రాజ్యానికి బందిపోట్లు పెద్ద సమస్యగా మారారు.