ఎంకిపెళ్ళి సుబ్బిచావుకొచ్చిందన్నట్టు గోదావరి పుష్కరాలు రాజ్యం నడ్డి విరిగిపోవడానికే వచ్చేయేమో! అన్నట్టు తయారైంది ఆమె పరిస్థితి. వరస ఫోన్లు. బంధువులు జంటలు జంటలుగా దిగిపోయారు ఇంట్లో. మొహమాటమాయె! కాదనలేదు. దానికితోడు ఆమె చేతి వంట మహారుచిగా ఉంటుంది. ఆపైన రాజ్యం పొగడ్తలకి తెగ ఉబ్బిపోతుందాయె! ఇన్నింటిమధ్య చివరికి ఆమె వంటలు, ఆ చాకిరీ చేయలేక చేతులెత్తేసింది. అప్పుడేమైందంటే.....

****************

‘‘రాజ్యం నీ వంట సూపర్‌. మా ఆయనైతే, నువ్వు చేసిన చారు ‘ఎంత బాగుందో’ అని నిరంతరం కలవరిస్తూనే ఉన్నాడు’’ అంది పరమేశ్వరి. ‘‘చారొక్కటే నచ్చిందా’’ అడిగింది రాజ్యం నవ్వుతూ.‘‘చారేం ఖర్మ, నువ్వు చేసిన పనసకాయకూర చెయ్యమని షంటుతున్నాడు గురుడు అంది పరమేశ్వరి. ‘‘మరి చెయ్యకపొయ్యావా’’ అంది రాజ్యం.‘‘అమ్మో! నీ హస్తవాసి నాకెక్కడినుంచి వస్తుంది’’ అంది పరమేశ్వరి. ‘‘దసరా సెలవులకు వచ్చి నాలుగు రోజులు ఉండిపొండి’’ అంది రాజ్యం. ‘‘ఈ మాట ఈనగారికిచెబితే ఎగిరిగంతేస్తారు’’ అంది పరమేశ్వరి. ‘‘దానికేం భాగ్యమే రండి’’ అంది రాజ్యం మొహమాటంగా.పరమేశ్వరి ఫోన్‌ పెట్టేయగానే చిన్నకూతురు లావణ్య ఫోన్‌చేసింది. ‘‘అమ్మోయ్‌! నువ్వుపెట్టిన గుమ్మడికాయ వడియాలు సూపర్‌గా ఉన్నాయిటే, మా కొలిగ్‌ రాగిణి తెగ కలవరిస్తోంది’’ అంది ‘‘అవునా’’ అంది. ‘‘అవునే, ప్లీజ్‌.. ప్లీజ్‌ మళ్ళీ చేసి పంపవూ’’.

‘‘అలాగే పంపుతాలేవే తల్లీ’’ అని లావణ్య ఫోన్‌ పెట్టగానే మోహన్‌రావు ఫోన్‌ చేశాడు. ‘‘ఏంటి రాజ్యం, కథ రాశావా?’’ అడిగాడు. ‘‘ఎక్కడ గురువుగారూ పనులతో తెమలడంలేదు’’..‘‘పుష్కరస్నానం బహు భేషుగ్గా చేయించావని పుణ్యం బాగానే నువ్వు మూట గట్టుకున్నావని మా ఆవిడ వనజాక్షి తెగ జెలసీ పడుతుందనుకో!’’‘‘మీదంతా వేళాకోళం గురువుగారూ, వనజాక్షిగారు అలా ఏమీ అనుకోరు’’ అంది ముసిముసిగా నవ్వుతూ. ‘‘నువ్వు మాకు చేసిన మంచి, మర్యాదలు మరచిపోలేం రాజ్యం. వీలు చూసుకుని వచ్చి నాలుగు రోజులు అక్కడే ఉండి నీ ఆతిథ్యం స్వీకరించాలని ఉంది’’.‘‘అయ్యో! అదేం అంతభాగ్యం గురూజీ, దసరాకి రండి, మా పరమేశ్వరివాళ్ళుకూడా వస్తున్నారు’’. ‘‘ఔనా! మరి ఇంతమందికి మళ్ళీ చాకిరిచేయడం చిన్నవిషయంకాదుకదా’’.