శాంతమ్మ కొడుకు చనిపోయి ఇయ్యాళ్టికి ఆరేండ్లు. చెట్టంత కొడుకు. కాలుచెయ్యిఆడనినాడు గంజినీళ్లు పోస్తడనుకున్న కొడుకు. తండ్రికి తలగోరు కుండ పడతడునుకున్న కొడుకు. చేతికి అందిండు అనుకున్న కొడుకు.వాడ మీది పోరగాళ్ల కంటే ఎక్కువ సదివిన కొడుకు. తెలివితేటల్లో హుషారున్న కొడుకు. 

నలుగురి నోట్లో నాలుకలా మెదిలిన కొడుకు.ఇరుగు పొరుగోల్లు రోజుకు ఒక్కసారైనా ‘‘మంచి కొడుకును కన్నవ్‌ శాంతమ్మా’’ అని తారీఫ్‌ చేసేందుకు కారణమైన కొడుకు. పేరు బాలరాజు.‘’అమ్మా ఏందే మీకీ కష్టం. నేను నౌకర్‌ చేసి, మిమ్ముల కూలి పనులకు బంద్‌ చేపిస్త’’నన్న కొడుకు. అయినా వాణ్ణి ఇష్టపడనోళ్లు ఎవరూ ఉండరు. ఎందుకంటే వాడు అంత మంచోడు.ఇంటోళ్లకే కాదు, ఊరు ఊరందరికీ వాడంటే ఎందుకో తెలియని అభిమానం. ఎందుకంటే వాడు తన ఇంటి దు:ఖాన్నే కాదు, అందరి దు:ఖం తీరాలనెటోడు.‘’మనం బతుకుతున్న ఈ భూమి మన చేతుల్ల లేకుంట పోయింది. మన నీళ్లు మనకు రాకుంట అయినయి. ఏ ఒక్కటి న్యాయంగా దక్కకపాయె’ అని రోజూ విరామం లేకుండా తిరిగెటోడు.శాంతమ్మకు భయమయ్యేది. ‘‘బిడ్డా గీట్ల నువ్‌ అందరి గురించి మాట్లడితే ఎట్లరా? మంచి మాట్లాడుడే పాపం గీ కాలంల.

నువ్‌ గిట్ల లావు లావు మాట్లాడి నలుగురిని కూడేసుకోని లొల్లి చేస్తే, సర్కార్‌ ఊకోదు బిడ్డా. మన సుట్టాలాల్ల ఎంతమంది అన్యాలంగ సచ్చిన్రో నీకు తెలువదారా? వద్దు బిడ్డా, నువ్‌ అట్ల అవుడు నాకిష్టం లేదు. మాయ్యవు గాదు. జెర బుద్ధిగ సదువుకో. ఏదో సిన్న నౌకరొస్తే మన బతుకులు మారుతయి’’ అని ఎన్ని సార్ల బతిలాడిందో బాల్రాజును.‘‘ఏందమ్మ నీదొక లొల్లి. అరవయేండ్లుగా కొట్లాడుతనే ఉన్నం. మన బుక్క మనకు దక్కిందా? అయినా నీదొక పిచ్చిగాని, ఊరందరి బతుకు బాగుపడ్డ నాడే, మన బతుకు కూడా బాగుపడుతది. మంది దు:ఖం తీరనిది, మన రంది తీరుతదని నీకెందుకు అనిపిస్తున్నదో నాకు అర్థమయితలేదు’’ అని అంతెత్తున అరిచినట్టే లేచిండు బాల్రాజు.

అయినా శాంతమ్మ వెనకాడలేదు. ‘‘లేదు బిడ్డా. నువ్‌ ఇట్లా నడిస్తే ఎట్లా, నీ ఎనుక నీ తమ్ముడు ఉన్నడు. వాడు నీ బాటల్నే నడుస్తడు. నీకు యాదికున్నదో లేదో... చిన్నప్పటి సంది వాడు నీ నీడలెక్క నీ చెయ్యి పట్టి నడిచినోడు. నువ్‌ ఎటు బోతే అటు నీ ఎనుకే వచ్చెటోడు. నువ్‌ ఏ పని చేస్తే వాడూ అదే చేసెటోడు. వానికి ఏ తెలివి లేనినాడే అట్లా చేసినోడు. నీది డిగ్రీ సదువు అయిపోతున్నది కదా, వాడు ఈ యేడు డిగ్రీ సదువులకు వస్తున్నడు. మా అన్న నడిచినట్టే నేను నడుస్త అనుకుంటే, వాడు కూడా ఆగం కాడా చెప్పు బిడ్డా?’’ బతిలాడింది కొడుకును.