ఎండ చురచురలాడుతోంది. పల్లకి మోస్తున్న బోయలు చెమటలు కక్కుతున్నారు. ఈటెలు చేతబూని పల్లకి వెంట నడుస్తున్న ఓ నలుగురు సైనికులు బోయలను జోరుగా కదలమని తొందర పెడుతున్నారు.

పల్లకిలో కూర్చున్న సునందిక ఇబ్బందిగా కదులుతోంది. గంటల తరబడి సాగుతున్న ఆ ప్రయాణం ఆమెకు అలసటను తెప్పిస్తోంది. పల్చని తెరలోంచి విసుగ్గా బయటకు చూసిన ఆమె ముఖం ఒక్కసారిగా విప్పారింది. చిరపరిచితమైన తమ గ్రామ పొలిమేరలోని చెట్టూపుట్టలను చూడగానే ఉత్సాహం ఉరకలెత్తింది. దాదాపు ఐదేళ్ళ విరామం తర్వాత తన గ్రామానికి విచ్చేస్తున్నదేమో, ఆనందం పరవళ్ళెత్తుతోంది.సునందిక రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో రాజనర్తకి. ప్రభువులవారిని తన అందచందాలతో, నాట్యవిన్యాసాలతో వినోదింపజేస్తూ, రాజవైభోగాలను అందుకుంటోంది. ప్రభువులంటే ఎనలేని భక్తి, ప్రేమ. తల్లిదండ్రులు కాలం చేసి చాలా కాలమైంది. ఆమె ఎప్పటినుంచో తన స్వగ్రామంలోని బంధువులను, స్నేహితులను చూసి రావాలని భావిస్తోంది. సమయం చిక్కడంతో ప్రభువులవారి అనుమతి తీసుకుని ఆ రోజు తెల్లవారుజామునే బయలుదేరింది.దారి పొడుగునా మూటాముల్లె పట్టుకుని సాగిపోతున్న ప్రజలు కనిపించారు.

వారంతా అలా గ్రామాన్ని విడిచి ఎందుకెళ్తున్నారో అర్థంగాక సతమతమయింది. ఆ గుంపులో తన నెచ్చెలి అనామిక తారస పడటంతో పల్లకిని ఆపించి, అనామికను దగ్గరకు పిల్చింది సునందిక.ఆ ఇద్దరూ ఒకేసారి విరబూసిన కలువపువ్వులు! అందంలో నువ్వా నేనా అన్నట్టుండే ముద్దుగుమ్మలు! ఒకప్పుడు కలిసి ఆడిపాడిన ఆత్మీయ నేస్తాలు!రాచఠీవితో సుమనోహరంగా వెలిగిపోతున్న సునందికను గుర్తుపట్టింది అనామిక.‘‘అదృష్టమంటే నీదేనే ... ప్రభువులవారి ప్రాపకం లభించి హాయిగా వున్నావు. ఏలినవారి దయలేక అల్లాడుతున్నాం. మన గ్రామంలో ఓ చెరువు తవ్వించమని ప్రభులవారికి ఎన్ని విజ్ఞప్తులు చేసుకున్నా వింటేనా? రెండేళ్ళ నుంచీ వానల్లేక నీటికి కటకటొచ్చింది. కరువు మన గ్రామాన్ని మింగేయకముందే పొట్ట చేతబట్టుకుని వేరే ప్రాంతానికి వెళ్లిపోతున్నాం’’ బాధగా చెప్పి, గుంపువైపు పరుగులు తీసింది.సునందిక అది విని హతాశురాలైంది. పల్లకి గ్రామంలోకి ప్రవేశించింది. తను ఎవరికోసమొచ్చిందో వారంతా వలసబాట పట్టారని విని విచారగ్రస్తురాలైంది. నాట్యగురువును దర్శించుకొని ప్రణమిల్లింది. ఆయన ద్వారా గ్రామానికి పట్టిన దుస్థితిని తెలుసుకొని తల్లడిల్లింది. ఆ రాత్రికి అక్కడే వుండి, తెల్లారి విషణ్ణవదనంతో తిరుగుముఖం పట్టింది.