పొరుగూరువెళ్ళి మగపెళ్ళివారిని పెళ్ళిచూపులకు ఆహ్వానించాడతడు. ఒకవేళ తన కూతురుకు వాళ్ళకునచ్చి ఈ సంబంధం కుదిరితే చాలా ఏర్పాట్లు చేసుకోవాలి, సమయంసరిపోదు అనుకుంటూ అడ్డదారిన దట్టమైన అరణ్యమార్గంలో స్వగ్రామానికి బయలుదేరాడతను. అతడు సురక్షితంగా స్వగ్రామంచేరి కూతురుపెళ్ళి చేశాడా? అడవిమార్గంలో ఏం జరిగింది?

ఒకానొక గ్రామంలో గౌతముడనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి పెళ్ళీడుకు ఎదిగిన ప్రభావతి అనే కూతురు ఉంది. గౌతముడి ఊరికి సమీపంలో ఉన్న చతురపట్నంలో విప్రనారాయడు ఉండేవాడు. అతడూ సద్బ్రాహ్మణుడే. అతని కుమారుడు సత్యనాథుడు తన కుమార్తెకు అన్నివిధాలా ఈడూజోడుగా ఉంటాడని గౌతముడికి తెలిసింది. మంచి ముహూర్తం చూసుకుని ఒకరోజు చతురపట్నానికి ప్రయాణమయ్యాడు. అనుకోకుండా అదే సమయంలో, ఆ ఊరు షావుకారు కూడా తన గుర్రపుబగ్గీమీద చతురపట్నం వెడుతూ, దారిలో గౌతముణ్ణిచూసి తనబగ్గీలో ఎక్కించుకున్నాడు. అలా గౌతముడి ప్రయాణం సుఖంగా సాగిపోయింది.గౌతముడు విప్రనారాయణుడి ఇల్లు చేరుకునేసరికి, ఇంట్లో సత్యనాథుడొక్కడే ఉన్నాడు.

తన తల్లిదండ్రులు జరుగురు (అత్యవసరమైన)పనిమీద పొరుగూరు వెళ్లారనీ రెండురోజుల్లో తిరిగి రాగలరనీ సత్యనాథుడు ఆయనకి చెప్పాడు. సత్యనాథుడు సన్నగా, పొడుగ్గా చురుగ్గా ఉన్నాడు. మాట సౌమ్యంగా ఉంది. అతడు గౌతముడికి బాగా నచ్చాడు. ఎలాగో అలా ఈ సంబంధం స్థిరపరచాలని మనసులో గట్టిగా అనుకున్నాడు గౌతముడు. విప్రనారాయణ తిరిగివచ్చేదాకా ఆ ఊళ్ళోనే ఉండి ఎదురుచూశాడు. ఈలోగా షావుకారు తనపని ముగించుకుని గ్రామానికి తిరిగివెళ్లిపోయాడు.రెండురోజుల్లో విప్రనారాయణ దంపతులు పొరుగూళ్లో పని పూర్తిచేసుకుని చతురపట్నానికి తిరిగొచ్చారు. గౌతముడు వారిని కలుసుకుని తాను వచ్చినపని చెప్పాడు.

వారు గౌతముడి వివరాలు తెలుసుకుని, ‘‘మీది చక్కని సంప్రదాయకుటుంబం. మీతో సంబంధం కలుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మా ముఖ్య బంధువులు కొందరితో కలిసి వారంరోజుల్లో మీ ఇంటికొస్తాం. పిల్లనచ్చితే వెంటనే వివాహం జరిగిపోతుంది. పిల్ల నచ్చుతుందనే మా నమ్మకం’’ అన్నారు. ఈ మాటలకు గౌతముడు కొంచెం సంతోషించినా అంతకంటే ఎక్కువగా కలవరపడ్డాడు. ‘‘పెళ్ళి వెంటనే జరిగిపోవాలా?’’ అడిగాడు కంగారుగా.‘‘అవును, రెండువారాల్లో పెళ్ళి జరక్కపోతే, మళ్లీ ఏడాదివరకు మా ఇంట్లో ఏ శుభకార్యం జరగడానికి వీల్లేదు. మీ సంబంధం నచ్చిందనేగానీ, లేకపోతే ఏడాదివరకు మా అబ్బాయికి పెళ్ళిచేసే ఉద్దేశ్యమే మాకు లేదు’’ అన్నాడు విప్రనారాయణ. గౌతముడు ఆలోచనలో పడ్డాడు.