ఒకానొకప్పుడు సిద్ధేశ్వరమనే గ్రామంలో రూపవతి అనే అందమైన యువతి ఉండేది. పాపం, ఆమెకు తల్లి లేదు. సవతి తల్లి చంచల ఆమెను చాలా బాధలు పెట్టేది. రూపవతి తండ్రి మాతంగుడు భాగ్యవంతుడు. రెండుసార్లు రాజసన్మానం కూడా పొందాడు. అందువల్ల, ఊరందరికీ అతడంటే గౌరవం. కానీ ఆయన కూతురి గురించి పట్టించుకునేవాడు కాదు.చంచలకు భానుమతి అనే కూతురు ఉంది. చిన్నప్పుడు భానుమతికి అక్కంటే ప్రేమ ఉండేది. కానీ వయసు వచ్చేసరికి రూపవతి అందంగానూ, భానుమతి సామాన్యంగానూ తయారయ్యారు. దానితో భానుమతిలో అసూయ మొలకెత్తి తాను కూడా అక్కని ఏడిపించేది. అందుకు తల్లి మద్దతు కూడా ఉండటంతో, ఇక రూపవతి కష్టాలకు అంతే లేదు.
సవతి కూతురు విషయంలోనేకాదు, సహజంగానే చంచల మంచిది కాదు. ఆమె సాయం పొందాలంటే, రూపవతిని నిందించాలని ఊళ్లో చాలామందికి తెలిసిపోయింది. అవసరంలో ఉన్నవాళ్లు వాళ్లింటికొచ్చి, సవతితల్లిని బాగాపొగిడి, రూపవతిని పరిహసించి, సహాయం పొందేవారు. వీధిలోకి వస్తే నలుగురూ పరిహసిస్తారని, ఇంట్లోంచి బయటకు వచ్చేదికాదు రూపవతి. అలా ఆమెకు ఇంట్లోవాళ్లమీదనే కాదు, ఊళ్లోవాళ్లమీదా ద్వేషం పుట్టి, అది క్రమ క్రమంగా పెరిగిపోతూ వచ్చింది.రూపవతి పక్కింట్లో ఉన్న విజయుడిదీ ఇదే పరిస్థితి.
అతడి తల్లీ తండ్రీ చిన్నతనంలోనే చనిపోతే, పనివాడిగా పనికొస్తాడని తమ ఇంటికి తెచ్చుకున్నారు పొరుగింటివాళ్లు. అతడు ఆ ఇంట్లో ఎంత పనిచేసినా గౌరవం కానీ, సరైన తిండి కానీ ఉండేది కాదు.ఒకరోజున రెండిళ్లవాళ్లూ తమ తమ ఇళ్లకి రూపవతినీ, విజయుణ్ణీ కాపలాగాపెట్టి, గ్రామంలో నాటకమవుతూంటే చూడ్డానికివెళ్లారు. అప్పుడు మొదటిసారిగా విజయుడు, రూపవతి కలుసుకుని మాట్లాడుకున్నారు. ఇద్దరివీ ఒకేరకం కష్టాలు కావడంతో, ఒకరికొకరు నచ్చారు. అప్పట్నించీ వాళ్లిద్దరూ వీలున్నప్పుడల్లా రహస్యంగా ఒకరినొకరు కలుసుకుంటూ ఉండేవారు.