మానవుడు దానవుడుగా మారి అకృత్యాలకు పాల్పడటం, ఎంతోమందిని బాధించడం మనకు తెలుసు. కానీ అరణ్యగుహల్లో బతికే రాక్షసుడు మనిషిగా రూపాంతరం చెందడం అస్సలు సాధ్యపడే విషయమేకాదు. ఎందుకంటే మనిషే అతడి ఆహారం. నరవాసన తగిలితేచాలు, చంపితినడం ఒక్కటే రాక్షసుడికి తెలిసినవిద్య! కానీ ఇందుకు విరుద్ధంగా ఈ కథలో మాత్రం ఒక రాక్షసుడు మనిషిగామారి చక్రవర్తిస్థాయికి ఎదిగాడు!! ఇంతకూ రాక్షసుడిని చక్రవర్తిగా మార్చింది ఎవరు?
సింధూరపర్వత ప్రాంతంలోని ఓ గుహలో క్రూరాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. ఒకరోజు అతడికి బాగా ఆకలేసి - దగ్గర్లో ఉన్న గ్రామానికి వెళ్లాడు. అప్పుడక్కడ ఓపెళ్ళి జరుగుతోంది. ఊరు ఊరంతా అక్కడే ఉంది. క్రూరాసురుడు వెళ్లేసరికి పెళ్ళిపందిట్లో ఒకపక్క ఆడవారు, మరోపక్క మగవారు కూర్చున్నారు. పెళ్ళిపీటలమీద వధువు, వరుడు ఉన్నారు. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. అక్కడున్నవారంతా ఆరోగ్యంతో మిసమిసలాడిపోతున్నారు. సంతోషంతో కళకళలాడిపోతున్నారు. వాళ్లను అలా చూడగానే రాక్షసుడికి ఆకలి పెరిగిపోయింది. ఉత్సాహంగా పెడబొబ్బ పెట్టాడు. అంతే, పెళ్ళిపందిట్లో కలకలం రేగింది. అంతా ఉలికిపడ్డారు. రాక్షసుణ్ణిచూసి నిశ్చేష్టులైపోయారు.రాక్షసుడు వారితో, ‘‘ఎంత దూరంవెళ్లినా నా చేయిచాపి, మిమ్మల్ని అందుకోగలను, కాబట్టి ఎవ్వరూ కదలొద్దు. పారిపోవద్దు. నాకిప్పుడు చాలా ఆకలేస్తోంది. మీలో కొందర్నితిని తృప్తిగా వెళ్లిపోతాను’’ అన్నాడు.
అప్పుడు అక్కడున్న పెళ్ళిపెద్దల్లో ఒకాయన కొంచెం ధైర్యం తెచ్చుకుని, ‘‘ఆకలిగా ఉంటే మనుషుల్ని తినడం ఎందుకు? రుచికరమైన పెళ్ళిభోజనం ఉంది’’ అన్నాడు. రాక్షసుడికి పక్వాహారం తినే అవకాశం ఎప్పుడోకానీ రాదు. అందుకని క్రూరాసురుడు సరేనన్నాడు.బ్రతుకుజీవుడా అని అక్కడి పెద్దలు అతడిముందో పెద్దపళ్లెం పెట్టి వడ్డనలు చేశారు. పెళ్ళివారందరికీ వండిన మొత్తం పదార్థాలన్నీ రాక్షసుడికే చెల్లిపోయాయి. క్రూరాసురుడు ఆఖరున బ్రేవుమని త్రేన్చి, ‘‘వంటకాలు అద్భుతంగా ఉన్నాయి. రోజూ నాకిలాంటి భోజనం కావాలి’’ అన్నాడు.‘‘మేము పెద్దపెద్ద విందులు చేసుకునేది ఎప్పుడైనా ఇలాంటి వేడుకల్లోనే.
రోజూ ఇలాంటి భోజనం ఏర్పాటు చెయ్యడానికి మాకు డబ్బు చాలదు’’ అన్నాడు పెళ్ళి పెద్ద. ‘‘అదంతా నాకు తెలియదు. మీరంతా కలిసి నాకు రోజూ ఇలాంటి విందు చేయాలి. లేనిపక్షంలో మిమ్మల్ని అందర్నీ తినేస్తాను’’ అన్నాడు క్రూరాసురుడు. ఆ వంటలు చేసిన భీమయ్య అప్పుడు ముందుకొచ్చి ‘‘నేనొచ్చి నీతో ఉంటాను. నువ్వు రోజూ జంతువుల్ని వేటాడితెచ్చి నాకు ఇస్తూండు. నేను నీకు వండిపెడతాను. దయచేసి వీళ్లని వదలిపెట్టు’’ అన్నాడు. క్రూరాసురుడు సరేనని భీమయ్యను తీసుకుని, వెంటనే తన గుహకు వెళ్లిపోయాడు.