రామాపురం గ్రామంలో కృష్ణశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సకలవిద్యాపారంగతుడు. ధర్మనిష్ఠాగరిష్ఠుడు. తనకు వచ్చిన విద్యల్ని ఉచితంగా అందరికీ నేర్పేవాడు. వివాహాది శుభకార్యాలకు శుభముహూర్తాలు నిర్ణయించడంలో అతడికి అఖండ ప్రజ్ఞ ఉన్నది. కృష్ణశర్మ ఇంట్లో ఎప్పుడూ పదిమంది విద్యార్థులు వేదాధ్యయనం చేస్తూ ఉండేవారు. జనంతో అతడి ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. శిష్యులను పోషించడమే కాక, తన ఇంటికొచ్చిన వారికి కూడా అతడు శక్తి కొలదీ అతిథి మర్యాదలు చేసేవాడు.
అతడికి తలిదండ్రులు ఇచ్చిన ఆస్తి తప్ప కృష్ణశర్మకు వేరే సంపాదన లేదు. ఎవరైనా తమకు తాముగా ఇచ్చింది పుచ్చుకోవడమేగానీ దేహీ అని ఎవరినీ యాచించడు. రోజులు గడిచేకొద్దీ అతడి ఖర్చులు నానాటికీ పెరుగుతున్నాయేగానీ, ఏ మాత్రం తగ్గడం లేదు. అందువల్ల, క్రమంగా కృష్ణశర్మ ఆస్తి హరించుకు పోతోంది. అతడికి అనుకూలవతి అయిన భార్య గుణవతి. భర్త మనసు నొప్పించకూడదని ఏమీ అనేదికాదు. కానీ - తన పిల్లల భవిష్యత్తు గురించి ఆమెకు చాలా బెంగగా ఉంది. ఎందుకంటే కూతురు పెళ్ళీడుకొచ్చింది. ఆ తర్వాత ఇద్దరు మగపిల్లలూ ఇంకా విద్యాభ్యాసం చేస్తున్నారు.
ఇలా ఉండగా, ఒక రోజున కృష్ణశర్మ కూతుర్ని చూడ్డానికి పెళ్ళివారు వచ్చారు. వారికి పిల్ల నచ్చింది. అప్పటికప్పుడు జాతకాలు కూడా పరిశీలించారు. ఒక ఏడాది గడిచేదాకా మంచి ముహూర్తం లేదని తేలింది. అప్పటివరకు ఆగుతామనీ, అప్పుడే పెళ్ళిజరిపించమని చెప్పి పెళ్ళివారు వెళ్లి పోయారు. వాళ్లు వెళ్లాక గుణవతి దిగులుగా, ‘‘పెళ్ళంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఏడాది తర్వాత మాత్రం అమ్మాయి పెళ్ళి మనం ఎలా చేయగలం?’’ అంది.