నూరుకట్ల కథలురాక్షసుడి కోరికరచనః వసుంధరఒకానొక దుర్గమారణ్యంలో భయానకుడనే రాక్షసుడు ఉండేవాడు. వాడు కొంతకాలం మనుషుల్ని హింసించి వినోదించాడు. కానీ ఎందుకో క్రమంగా వాడికి అలాంటి జీవితమంటే విరక్తి కలిగింది. ఆకలి వేసినప్పుడు దొరికిన జంతువును చంపి తింటూ, మిగతా సమయాల్లో దిగులుగా కాలం గడపసాగాడు.ఒకరోజున ఆ అరణ్యంలో ఓ జ్ఞాని ప్రవేశించాడు. ఆయన అడుగెట్టిన కాసేపటికే భయానకుడెదురై, జ్ఞానిని చూసి చేత్తో పట్టుకుని, 'చాలాకాలం తర్వాత ఈరోజు మళ్లీ నరమాంసం తినాలనిపిస్తోంది!' అన్నాడు ఉత్సాహంగా. జ్ఞాని వాడితో, 'జనాలకు దూరంగా ఉంటూ మోక్షసాధన చెయ్యాలని ఈ అడవికి వచ్చాను. ఇక్కడ ఒక ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చెయ్యాలనుకున్నాను. చివరకు నీ చేతుల్లో నాకు మోక్షం లభిస్తున్నది' అన్నాడు.భయానకుడు జ్ఞానిని తేరిపార చూసి, ఆయన ముఖంలోని తేజస్సుకి ఆశ్చర్యపడ్డాడు. 'అయ్యా! తమ రెవరో సిద్ధపురుషుడివలె ఉన్నారు. మీకు నేను మోక్షం ఇవ్వడమేమిటి? నాకే మీరు మోక్షమార్గం ఉపదేశించాలి' అన్నాడు ఆయనతో. 'నువ్వు రాక్షసుడివి. నీక్కూడా మోక్షంమీద మోజుందంటే నమ్మలేను' అన్నాడు జ్ఞాని ఆశ్చర్యంగా.'ఇంతకాలం క్రూరంగా జీవించాను. జంతువుల్ని హింసిస్తూ ఆనందం పొందాను. రాక్షసుణ్ణి కాబట్టి నాకది అసహజం కాదు. కానీ ఎందువల్లనో నా జీవితం నాకు నచ్చలేదు. రోజులో చాలాసేపు అసంతృప్తితో దిగులుగా ఉంటున్నాను. నా దిగులు పోవడానికి ఏమైనా ఉపాయం చెప్పగలరా?' అన్నాడు భయానకుడు వినయంగా. జ్ఞాని కాసేపాలోచించి, 'రాక్షసుడివి కాబట్టి కోరిన రూపం ధరించే కామరూప విద్య నీకు తెలిసే ఉండాలి. కొంతకాలం మానవరూపంలో వెళ్లి మనుషుల మధ్య జీవించి వెనక్కి రా. ఆ సమయంలో ఎట్టి పరిస్ధితుల్లోనూ ఎవరికీ హాని చేయకూడదు సుమా!' అన్నాడు.రాక్షసుడు సరేనన్నాడు. వాడు తానే స్వయంగా అక్కడ కొంతమేర భూమిని శుభ్రం చేసి జ్ఞానికోసం ఆశ్రమ నిర్మాణం చేసి, 'మీరిక్కడ సుఖంగా తపస్సు చేసుకోండి, నేను వెళ్లొస్తాను' అని వెళ్లిపోయాడు. జ్ఞాని తన అదృష్టానికి సంతోషించి, ఆ ఆశ్రమంలో తపస్సు చేసుకోసాగాడు. అయితే ఆయన తపస్సు ప్రారంభించిన కొన్నాళ్లకే, రాక్షసుడు వెనక్కి వచ్చేశాడు. జ్ఞాని ఆశ్చర్యపడి, 'ఏం, భయానకా! మనుషులు నచ్చలేదా? త్వరగా వెనక్కి వచ్చేశావు!' అనడిగాడు.