ఒకానొకప్పుడు సౌగంధిక దేశంలోని స్త్రీలు మహా సౌందర్యవతులుగా ముల్లోకాల్లోనూ ప్రసిద్ధిచెందారు.దేవ, దానవ, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులు వారి సౌందర్యం చూడ్డానికి సౌగంధికదేశానికి వచ్చి వెడుతూండేవారు. వారివల్ల సౌగంధిక దేశంలోని సామాన్యులకు చాలా ఇబ్బందులు కలుగుతూ ఉండేవి.
సౌగంధిక ప్రభువు సుందరవర్మ ప్రజాక్షేమం కోరి, ఒక సంవత్సరం పాటు అన్నపానాలు మాని గాలినే భోజనం చేస్తూ ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడి సాక్షాత్కారం పొందాడు.‘‘సౌగంధిక పౌరులు స్వయంగా ఆహ్వానిస్తేతప్ప మానవులు కానివారెవ్వరూ మా దేశంలో అడుగుపెట్టకూడదు, ఆహ్వానం లేకుండా మాదేశంలో అడుగుపెట్టిన మానవేతరులు తమ దివ్యశక్తులన్నీ కోల్పోయి సామాన్యమానవులైపోవాలి. అలా వరం ప్రసాదించు దేవదేవా!’’ అని సుందరవర్మ బ్రహ్మని కోరాడు. బ్రహ్మ సుందరవర్మకు కోరిన వరం ప్రసాదించాడు.సుందరవర్మ ఈ విశేషాన్ని ప్రజలందరికీ తెలియబరిచాడు. ఆ తర్వాతనుంచి సౌగంధిక దేశంలో ప్రజలందరూ సుఖజీవితం వెళ్లబుచ్చుతున్నారు.
ఇలా ఉండగా, ఒకరోజు, పాతాళలోకంనుంచి మహానందుడనే రాక్షసుడు భూలోకసంచారానికి వచ్చాడు. వాడు దేశదేశాలన్నీ తిరిగి సౌగంధికదేశం పొలిమేరల్లోకి చేరుకున్నాడు. అప్పుడు వాడి చెవుల్లో, ‘‘ఓ రాక్షసవీరా! మానవేతరులు ఈ దేశంలో ప్రవేశించకూడదు. ఈ దేశపౌరులు ఎవరైనా స్వయంగా పిలవనిదే, అడుగు ముందుకేసి ఆ దేశంలోకి ప్రవేశిస్తే, నీ సర్వశక్తులూ కోల్పోతావు, నువ్వు కూడా ఒక అతి సామాన్యపౌరుడుగా మారిపోతావు’’ అన్న హెచ్చరిక వినబడింది.
రాక్షసుడు తడబడ్డాడు. ఆగిపోయాడు. సౌగంధిక దేశం వెళ్లాలన్న ఆలోచన మానుకుని వెనక్కు తిరగగానే, వాడికి ఓ బలిష్ట మానవుడు అటుగా వెడుతూ కనిపించాడు. రాక్షసుడికి నోరూరింది. చటుక్కున ఆ మనిషిని పట్టుకున్నాడు.ఆ మనిషి రాక్షసుణ్ణి చూసి, గజగజ వణకిపోతూ, తనచేతిలోని చిత్రపటాన్ని జారవిడిచాడు. అది రాక్షసుడి కంటపడింది. ఆ చిత్రపటాన్ని తెరచిచూశాడు రాక్షసుడు. జగన్మోహినివంటి యువతి రూపురేఖలున్న యువతి చిత్రపటం అది!