‘‘దానం అంటే ఏమిటి మమ్మీ!’’ఇంగ్లీషు తప్పితే తెలుగు తెలియని, తొమ్మిదో తరగతి చదివే మా ఒక్కగానొక్క కూతురు సౌమ్య తన తల్లిని అడిగింది.డ్రాయింగ్‌ రూమ్‌లో ఆఫీసుఫైలు చూసుకుంటున్న నాధ్యాస క్షణకాలం హాల్లోకి వెళ్ళిపోయింది.

ఆ రోజు సెకండ్‌ సాటర్‌ డే! రోజూ హడావిడిగా లంచ్‌ బాక్స్‌తో నేనూ, సౌమ్యా బయలుదేరే కార్యక్రమానికి కొంచెం ఆటవిడుపు! ఉదయాన్నే వంటింటితో కాపురం చేయాల్సిన నర్మదకు ఆ శని, ఆదివారాలు కొంచెం విశ్రాంతి. అందుకే టిఫిన్‌ ప్రిపరేషన్‌కూ కామాపెట్టి, కాఫీలతో సరిపెట్టేసింది.ఆ రోజు సౌమ్యకు ఎందుకో హాలిడే. అదికూడా వాళ్ళ అమ్మతోబాటు టీవీలో తెలుగు ప్రోగ్రాం చూస్తోంది.ఉదయంపూట ఎందరో మహానుభావులుచెప్పే ప్రవచనాలు నాకుకూడా వినిపిస్తూనే ఉన్నాయి. అవి వింటున్నసౌమ్య అడిగినప్రశ్నకు నర్మద ఏమిసమాధానం చెబుతుందో వినాలని ఆసక్తికరంగా చెవులు రిక్కించాను.

నర్మద జవాబు చెప్పనట్లుంది!సౌమ్య మళ్ళీ అడిగింది... ‘‘దానం అంటే ఏమిటి మమ్మీ!’’‘‘నాకు తెలియదు పో! మీ డాడీనడుగు! ఆయనకే తెలుసు, దానం అంటే ఏమిటో ధర్మం అంటే ఏమిటో?’’ నర్మద గొంతులో విసుగు ధ్వనించింది.‘‘అదికాదు మమ్మీ! నీకు తెలిస్తే చెప్పవచ్చుగా!’’‘‘నాకు తెలియదని చెప్పానుగా! ఎక్కడా ప్రవచనాలు చెప్పకపోయినా, ఇంట్లో మాత్రం నాకు చెబుతుంటారుగా ప్రవచనాలు! ఆయననే అడుగు, నాకు తెలియదుపోవే! టీవీలో చక్కని మాటలు చెబుతున్నారు. కొంచెం విననీయవే! పండగనాడు కూడా పాత మొగుడేనా? అన్నట్టు ఏమిటి నాకీ నస?’’నర్మద గొంతులో తారస్థాయినందుకున్న విసుగునువిన్న నేను ఆఫీసు ఫైలు మూసేసి హాల్లోకి వెళ్ళవలసిన అవసరాన్ని గుర్తించాను!‘‘అమ్మా! అంటే ఏమిటి మమ్మీ? అని ఎవరో నీలాంటి అమ్మాయి వాళ్ళ అమ్మనడిగినట్లుగా ఉంది!’’సౌమ్య ప్రక్కన సోఫాలో కూర్చుంటూ నర్మద వైపు చూశా!