ఒక్క ఉదుటున పందిట్లోకి వచ్చి పడింది శ్రీవాణి.ఎవరో నాలుగుచేతులమనిషి బలంగా పట్టుకుని బయటకు తోసినంత వేగంగా వచ్చింది. మనిషి నిలువునా వణికిపోతోంది. నోట మాట రావటం లేదు.‘‘ఏమయిందే?’’ పందిట్లో కూచున్నవాళ్ళు కంగారుగా ప్రశ్నించారు. భయంతో వెర్రిచూపులు చూస్తూ, తన వాటాకేసి చెయ్యెత్తి చూపిస్తోందేతప్ప, ఏమీ చెప్పలేకపోతోంది.
చటుక్కునలేచి ముందుకువచ్చింది మంగ. శ్రీవాణి భుజంమీద చెయ్యివేసి, దగ్గరకు తీసుకుంది.‘‘ఓ నిమిషంకూర్చో. స్థిమితపడు. నెమ్మదిగాచెప్పు. ఎందుకలా వణికిపోతున్నావు? ఏమైంది?’’ అని అనునయంగా అడిగింది.అప్పటికి దడదడలాడుతూనే ఉంది శ్రీవాణి. మంగని గట్టిగాపట్టుకుని, వణికేగొంతుతో చెప్పింది. ‘‘పా...పా....పాము’’ ఆ మాటతో అక్కడున్న వాళ్ళందరూ ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా లేచినిలబడ్డారు. ఆ పామేదో తమమధ్యకే వచ్చినంత కంగారు వాళ్ళల్లో!సాయంత్రంవేళ. వేసవి ఎండ తీవ్రతని కొంత తగ్గిద్దామా అని సూర్యుడు యోచిస్తున్న సమయం.అలాంటి సమయంలో ఇంటికెదురుగా వేసుకున్న పచ్చనితాటాకుల పందిరికిందచేరి, పగలంతా పాకలో ఉక్కిపోయిన శరీరాలకి కాస్త గాలిపోస్తూ, సేద దీరటం వాళ్లకి అలవాటు.
పందిరికి ఒకవైపునున్న వేపచెట్టు, మరోవైపునున్న మామిడిచెట్టు నీడతోపాటు, గాలినీ పంచుతంటాయి వాళ్లకి ఆ పడమటి సంధ్యలో.ఇల్లంటే పెంకుటిల్లైనా కాదు, రెండంకణాల రెల్లు పాక. చుట్టూ కొండరాతి గోడలు.సుమారొక అడుగుమందాన దిట్టంగా అల్లిన రెల్లు కప్పు. ఆ పాకలోనే, వెదురు తడికలతో వేరు చేస్తూ ఐదుభాగాలు. మధ్యలో ఉన్న పెద్దభాగంలో తన ఇద్దరుపిల్లలనీ పెట్టుకుని ఉంటుంది మంగ. తన భాగానికి అటూ, ఇటూ రెండేసి వాటాలుగాచేసి, నలుగురు జంటలకు అద్దెకిచ్చింది. బతుకు గడవటానికి అద్దె పుచ్చుకుంటున్నాగానీ, వారికి అంతకుమించిన ఆప్యాయత పంచుతూ, అందరినీ స్వంత కుటుంబంలా చూడటం ఆమె ప్రకృతి. సాయంత్రం కావడంతోనే, బావిలోంచి నీళ్ళు తోడి, తమ పాకమీది రెల్లుకప్పుని బాగా తడుపుతారువాళ్లు. ఆ తరవాత, పాకముందరి పందిరి కిందకి చేరుతారు. పాక కప్పుమొదట్లో ఆవిర్లు తేలినా, కాసేపటికి చల్లబడి, రాత్రిళ్ళు చల్లదనం వస్తుంది పాకలో.