అతడో సైంటిస్టు. అచ్చం తనలా ఉండే రోబోను తయారు చేశాడు. మీడియా కాన్ఫరెన్స్‌లో దాని ప్రతిభాపాటవాలు ప్రదర్శించి చూపించాడు. అసలు విషయం ఏమిటంటే, అచ్చం తనలా ఉండే రోబోకు, తన మేధస్సునే కాపీచేసి ప్రతిసృష్టి చేశాడతను. విలేఖరులడిగిన ప్రశ్నలకు అచ్చం ఆ సైంటిస్టులాగే సమాధానాలు చెప్పింది రోబో. చిరంజీవిలా డ్యాన్స్ కూడా చేసింది. కానీ ఈ కథలో అస్సలు ఊహించని పరిణామం ఏమిటంటే
‘‘ఏమండీ, ఇది విన్నారా?’’ప్రొఫెసర్ సుబ్బారావు సాయంత్రం ఇంటికి రాగానే భార్య కాంతం ఆత్రంగా అడిగింది.సుబ్బారావు చెవులు రిక్కించి, తల గోక్కుంటూ ‘‘నాకేమీ వినిపించటం లేదే’’ అన్నాడు.‘‘అబ్బా! విన్నారా అంటే ఎవరి మాటలో వినబడటం కాదండీ, రాంబాబు చేసిన ఘనకార్యం గురించి విన్నారా అని అడుగుతున్నా’’‘‘రాంబాబు ఎవరు?’’‘‘అబ్బబ్బా! మీ మతిమరుపుతో నా మతిపోయేలా ఉంది. మన కాలనీలో రాంబాబు అనే ఓ ప్రాణి ఉందన్న సంగతి అప్పుడే మరచిపోయారా?’’ చిరాగ్గా అంది కాంతం.
‘‘చూడు కాంతం, ఒక్కోసారి నేను నీ పేరే మరచిపోతుంటాను. ఇక నాకు బయటవాళ్ళ పేర్లు ఎలా గుర్తుంటాయి చెప్పు?’’ సోఫాలో కూర్చుంటూ అన్నాడు సుబ్బారావు.‘‘రాంబాబు మీ చిన్ననాటి మిత్రుడు కదండీ. గొప్ప సైంటిస్ట్ కూడా. మన కాలనీలోవున్న తన ఇంట్లోనే ప్రయోగాలు చేస్తుంటాడు. ఇప్పుడు గుర్తొచ్చాడా?’’ విడమర్చి చెప్పింది కాంతం.‘‘ఇంత చెప్పాక గుర్తుకురాక ఛస్తాడా? కాని కొన్నాళ్ళుగావాడు ఎవరికీ కనిపించటంలేదుగా. రాత్రీపగలు ఇంట్లో ప్రయోగాలు చేస్తున్నాడు. కాని ఇంత చేస్తున్నా ఇంతవరకు ఊడబొడిచిందేమీ లేదు’’.‘‘ఈసారి మాత్రం పొడిచాడండీ’’.‘‘ఎవర్ని పొడిచాడు?’’‘‘పొడిచాడంటే నా ఉద్దేశ్యం సాధించాడని’’‘‘ఏం సాధించాడు?’’‘‘ఓ రోబోని తయారుచేశాడు’’.‘‘అదేం గొప్ప విషయం కాదు’’‘‘కాని ఆ రోబో అచ్చం రాంబాబు లాగే ఉంటుందట’’.‘‘అందులో వింత ఏముంది? రోబో సిన్మాలో రజనీకాంత్ ఆ పని ఎప్పుడో చేశాడు కదా?’’‘‘కాని అది సినిమా, ఇది వాస్తవం! ఆ రోబో పేరు ర్యాంబో అట’’.‘‘ఓహో! తన పేరును పోలివుండే పేరు తన రోబోకి పెట్టుకున్నాడన్నమాట!’’‘‘ఈరోజు సాయంత్రం ఆరుగంటలకు రాంబాబు మీడియాముందు ర్యాంబోని ప్రదర్శించబోతున్నాడు. ఆ ప్రదర్శనకి మనల్నికూడా ఆహ్వానించాడు’’ అంటూ కాంతం ఓ అందమైన కార్డు భర్తచేతిలో పెట్టింది. సుబ్బారావు ఆ కార్డుని దీక్షగా చూశాడు. అదొక ఎలెక్ట్రానిక్ ఇన్విటేషన్ కార్డు. దానిపైన సుబ్బారావు దంపతులపేర్లతోపాటు ఓ కోడ్ నంబర్ కూడా ఉంది.