‘‘గాయత్రీ, ఎల్లుండి హైదరాబాదు వస్తున్నా ఊళ్లోనే ఉంటావుగా...సరే వీలైతే రాఘవశర్మ ఏవో ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చెబుతాడట. ఆయన వివరాలు కనుక్కో. నే వచ్చాక వివరంగా మాట్లాడుకుందాం’’ రాజేశ్వరి ఫోన్ పెట్టేసింది.
రాజేశ్వరి అమెరికానుంచి ఇంత అకస్మాత్తుగా ఫోన్ చేయడం అదీ చాలా ఏళ్ల తర్వాత రాఘవశర్మ వివరాలు కనుక్కోమనటం అంతా నాకు విచిత్రంగా తోచాయి.రాజేశ్వరి, నేను సహాధ్యాయులం. రాజేశ్వరి కుటుంబం ఆర్థికంగా ఉన్నతస్థాయిలో ఉండేది. వాళ్లనాన్న ప్రభుత్వోద్యోగి. అదీగాక ఆస్తిపాస్తులున్నాయి. అందువల్ల రాజేశ్వరి, మా మిత్రబృందంలో చుక్కల్లో చంద్రుడిలా ఉండేది.రకరకాలు, దుస్తులు, గొలుసులు, రిబ్బన్లు దినవారీ ఖర్చులు, చేతిలో పర్సు...ఆ రోజుల్లో సైకిల్‌మీద స్కూలుకొచ్చేది. మాకందరికీ అప్పుడప్పుడు వాళ్లింట్లో తినబెట్టేది. సినిమాలకు తీసుకెళ్ళేది. రాజేశ్వరి చదువులో మాత్రం అంతంత మాత్రమే. క్లాసులో నేను తెలివిగల దానినని మార్కులు బాగా వస్తాయని నాతో ఎక్కువ స్నేహంగా ఉండేది.
రాజేశ్వరికి కొంచెం అతిశయం, గర్వం భేషజం ఉండేది. పైగా ఆర్థికంగా లేనివాళ్లంటే మాటల్లో, చేతల్లో చులకనభావం కూడా ఉండేది.రాజేశ్వరి పెళ్ళి కూడా అంగరంగవైభంగానే జరిగింది. ఆ పెళ్ళికి మమ్మల్నందర్నీ పిలిచింది. ఎక్కడ రారోనని, తప్పకరావాలంటూ మాతో ఒట్టు కూడా వేయించుకుంది.‘‘తన వైభవం చూపాలన్న తాపత్రయం’’ అని కొందరు చెవులు కొరుక్కోవడం కూడా నాకు తెలుసు.పెట్రోమాక్స్‌లైట్లు, బ్యాండ్ మేళం, షోకారులో వధూవరుల ఊరేగింపు పెళ్ళిలో రకరకాల తినుబండారాలు ఇవన్నీ కలిసి, రాజేశ్వరి వివాహం ఆ రోజుల్లో ఘనంగా జరిగిందనే చెప్పుకునేవాళ్లు. పైగా పెళ్ళికొడుకు అమెరికాలో పెద్ద ఉద్యోగి, పైగా అందగాడు. ఇవన్నీ రాజేశ్వరి గురించిన నా జ్ఞాపకాలు.