రావు గారు చాలా పెద్ద మనిషి.. చాలా పద్ధతైన మనిషని ఊర్లో అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ‘‘అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాల్లో ఇలాంటి వాడు లేడు’’ అని రావుగారి చిన్నతనంలో ఆయన నాయనమ్మ మురిసిపోతూ ఉండేది.ఆవిడ మాటలు నిలబెట్టడానికాఅన్నట్లు ఆయన ఏ నాడూ క్రమశిక్షణ తప్పలేదు. పద్ధతి లేని మనుషులంటే రావుగారికి చాలా చిరాకు. అసలు అలాంటి వాళ్లకు ఈ భూమి మీద బతికే హక్కే లేదనేది ఆయన గాఢమైన అభిప్రాయం. ‘‘ఐ డోంట్నో వై దీస్ పీపుల్ ఎగ్జిస్ట్ ’’ అని విసుక్కొనేవారు. పుట్టిన ఊరులోనేస్కూలింగ్ పూర్తయింది. పక్క వూరిలో కాలేజీ చదువు కూడా అయిపోయింది. అప్పుడప్పుడేబ్యాంకులు పెడుతున్నారు. రావు గారి ఊరిలో కూడా ఒక బ్యాంకు పెట్టారు. దాంట్లో ఆయనకిఉద్యోగం వచ్చేసింది. ఉన్న పొలాన్ని చూసుకుంటూ.. ఊర్లోనే ఉద్యోగం చేసుకుంటూ అలా రావుగారు జీవితం గడిపేవారు. వీలైతే మరో దశాబ్దం కూడా అలాగే గడిచిపోయేది ఆ పెళ్లి జరగకుండా ఉంటే...రావు గారి భార్య సీత చాలా సౌమ్యురాలు. ‘‘ఎలా పడుతోందో ఆ మనిషితో.. గాలిని కూడా డిసిప్లైన్లో పెట్టాలని చూస్తాడు ఆ పెద్ద మనిషి’’ అని ఊరువారు అనుకుంటూ ఉండేవారు.
రావు గారు పద్ధతిని మార్చాలని సీత కూడా పెళ్లైన కొత్తలో ప్రయత్నించింది. ఒక నెల రోజులయ్యాక రావు గారికి ఈ విషయం అర్థమయింది. ‘‘నిన్నైనా వదిలేస్తా కాని.. నా పద్ధతిని వదిలేయను’’ అని ఖండితంగా చెప్పేసారు. ‘‘మనిషి మూర్ఖుడు.. అన్నంత పని చేస్తాడని’’ సీతకి అర్థమయిపోయింది. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మారకపోతాడా అని సీత ఆశ. ఇద్దరు పిల్లలు పుట్టారు. పెద్దవాళ్లు అయ్యారు. అయినా సీత ఆశ తీరనే లేదు. రావు గారి విషయం తెలిసిన ఆయన బంధువులు ఎప్పుడూ ఆయనను దగ్గరకు చేరదీయలేదు. దానికి ఆయనా ఎప్పుడూ బాధ పడలేదు. ఇలా ఒక పద్ధతి ప్రకారం సాగిపోతున్న రావు గారికి ఒక శుభలేఖ వచ్చింది. అది ఆయన పెద్దనాన్న కొడుకుది. సాధారణంగా రావు గారు పెళ్ళిళ్లకు, పురుళ్లకు వ్యతిరేకం. అలాంటి చోట్లకు వెళ్తే ఏదీ పద్ధతి ప్రకారం జరగదని ఆయన నమ్మకం. అందుకే వీలైనంత వరకూ ఏ శుభకార్యానికి ఆయన వెళ్లడు. పెళ్లాం, పిల్లలను పంపడు. ఎందుకో ఆ శుభ లేఖ చూడగానే రావుగారి మనసులో- ‘‘ఆ పెళ్లికి వెళ్తే...’’ అనే ఆలోచన మొదలయింది. ఆలోచన వస్తే చాలు. సెకన్లలో నిర్ణయాలు తీసుకోవటం.. నిమిషాల్లో వాటిని అమలు చేసేయటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. శుభలేఖ వచ్చిన మర్నాడే- పెళ్లికి వెళ్తున్నామనే విషయాన్ని భార్య ఎదురుగా ప్రకటించేశారు రావుగారు. ఆవిడ విస్తుపోయింది. ఆ తర్వాత ఆశ్చర్యపోయింది. చివరకు ‘‘అంతా మన మంచికే జరుగుతుందని’’ సరిపెట్టుకుంది. రావుగారి ఇద్దరి పిల్లలకు ఆ విషయం తెలిసింది. వాళ్లకీ ఆనందపడాలో, ఆశ్చర్యపోవాలో అర్థం కాలేదు. అంతా ఇలా ఒక విచిత్రమైన స్థితిలో ఉండగానే ఊరు వెళ్లాల్సిన రోజు దగ్గరపడిపోయింది.