గట్టిగా శ్వాస పీల్చి వదిలాడు సీయీవో.మిగిలిన వాళ్లు శ్వాస బిగబట్టారు.చూపుడు వేలు, మధ్య వేలుకలిపి రెండు కనుబొమ్మల మధ్య పెట్టి నొక్కుతూ కళ్ళు మూసుకున్నాడతను. మిగిలిన వాళ్లు కనురెప్ప వేయకుండా అతన్నే చూస్తున్నారు. అప్పుడప్పుడు నిశ్శబ్దంగా ఒకరినొకరు చూసుకుంటున్నారు.
సెంట్రల్ ఏసీ చల్లగా ఉంది. అయినా అందరిలోపల టెంపరేచర్ ఫార్టీ దాటింది. ఒకటి - రెండు - మూడు - పది - ఇరవై - ముఫ్పై ఐదు - యాభై ఆరు ... సెకన్లు గడిచాయి.‘‘ఎవరూ ఏం చెప్పరా?’’ అంటూ, మెల్లగా కళ్లు తెరిచి ఎదురుగా గోడకున్న నాలుగు స్ర్కీన్స్ను సెకన్లో స్కాన్ చేసేశాడు సీయీవో.‘‘సర్ ... అది’’ ఏదో చెప్పబోయిన అవుట్‌పుట్ ఎడిటర్ నోటి మాట బయటకు రాక ముందే -‘‘అటు చూడండి ... ఆరేళ్ళ పాప, టీచర్ దాష్టీకం వల్ల చనిపోయింది. మంచి హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. బాగా వాడుకోవచ్చు. కాని, ఆ రిపోర్టర్ని చూస్తే వ్యూయర్ ఆగుతాడా .. వెంటనే ఛానల్ మార్చేస్తాడు.’’టీవీలో శ్యామ్ అనే రిపోర్టర్ పదిగంటల బులెటిన్‌లో లైవ్ ఇస్తున్నాడు. పాప ఆ తెల్లవారుఝామునే చనిపోయింది. హాస్పిటల్లో ప్రక్రియ అంతా ముగించి ఇంటికి తీసుకువచ్చారు అప్పుడే.
అంతా ఏడుస్తున్నారు. బ్రేకింగ్స్ పడుతున్నాయి. టీవీ మ్యూట్‌లో ఉంది. అయినా, విషయం ఆ మీటింగ్‌లో ఉన్న అందరికీ తెలుసు.‘‘క్రైమ్ ఇన్సిడెంట్ కాబట్టి క్రైౖమ్ రిపోర్టరే వెళ్ళాడు. తప్పేముంది? పైగా అతను చాలా సీనియర్. నిన్నటి నుంచి ఇష్యూని అతనే ఫాలో అప్ చేస్తున్నాడు కూడా. అతన్ని లైవ్‌లోకి తీసుకోకుండా ఉండటం కరెక్ట్ కాదు కదా?’’ కాస్త నొచ్చుకుంటూ వివరణ ఇచ్చాడు ఇన్పుట్ ఎడిటర్.ఒక్క సెకను ఇన్పుట్ ఎడిటర్ కళ్ళల్లోకి సూటిగా చూశాడు సీయీవో.‘‘అది కాదు రామారావ్ ... ఛానల్స్ అన్నీ ఒకే రకంగా ఇస్తున్నాయి. మనం డిఫరెంట్‌గా ఇస్తేనే కదా రేటింగ్ వచ్చేది. విద్య బిజెనెస్ అయిపోవటం, టీచర్ల ప్రవర్తన, శృతి వాళ్లింట్లో తల్లి, తాత, అమ్మమ్మల ఏడుపులు, పెడబొబ్బలు ... ఎక్సట్రా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో. ఈ ఇష్యూని మనం టేకప్ చేసి హడావిడి చేద్దాం ... ఏమంటారు?’’