వల్లకాటిలో సగం కాలి చల్లారిపోయి పొగ చూరిన కట్టెపేడులా ఉన్నాడతడు. పేరు మహారుద్ర. వయసు నలభైకి మించకపోయినా దుర్భర దారిద్య్రం వల్ల సరైన పోషణ లేక వయసు మళ్ళిన వాడిలా కనిపిస్తున్నాడు. బస్సు కిరాయికి డబ్బులు లేక బహుదూరం నుంచి నడుచుకుంటూ వచ్చాడేమో బాగా అలసిపోయి ఉన్నాడు. ఎంతో రద్దీగా ఉన్న ఆ ప్రధాన రహదారిని దాటే అవకాశం కోసం ఎదురుచూస్తూ వారగా నిలబడి ఉన్నాడు.

‘కొన్నిరోజులలో మెడికల్ కాలేజీ పిల్లలకు పరీక్షలు వస్తున్నాయి. వాళ్ళకిప్పుడొక శవం కావాలి. ఒక్క శవాన్ని అందిస్తే చాలు కమీషన్‌ వెయ్యి రూపాయలు తన చేతిలో వచ్చిపడతాయి. శవం కోసం ఆకలి కడుపుతో నాలుగు దినాలుగా ఎంతో ఆశగా ఆస్పత్రి చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. దేశంలో కోట్టకొద్దీ జనాభా ఉంది. ఆ జనాభాకి తగ్గట్టే ఎన్నెన్నో రోగాలున్నాయి. ఆ రోగాలకు తగ్గట్టే రోజూ ఎన్నెన్నో చావులు. కానీ తనకు మాత్రం ఒక్క శవం కూడా దొరకడం లేదు. ఛ... ఎదవ బతుకు... ఎదవ బతుకు...’తన జీవితం మీదా తన దారిద్ర్యం మీదా కలిగిన రోతతో గట్టిగా కాండ్రించి ఉమ్మేశాడు మహారుద్ర.అతడి కడుపులోని ఆకలి నాలుగురోజులనాటిది.అతడి ఒంటి మీది వస్త్రాలు వారంరోజు నాటివి.అతడనుభవిస్తున్న దారిద్ర్యం తాతలనాటిది.ఒక పశువులమంద అకస్మాత్తుగా రహదారి మీదకు రావడంతో వాహనాలన్నీ నిలిచిపోయాయి.

అదే అవకాశంగా మహారుద్ర చటుక్కున రహదారి దాటి ఎదురుగా ఉన్న ఆస్పత్రిలోకి ప్రవేశించాడు. వార్డులన్నీ దాటుకుంటూ ఆస్పత్రి వెనుక భాగాన ఉన్న శవాల గిడ్డంగి(మార్చురీ)కి చేరుకున్నాడు. మార్చురీకి ఎదురుగా కొన్ని గజాల దూరంలో దానికి అనుబంధంగా ఒక పెద్ద హాలు ఉంది. శవాల తాలూకూ బంధువులూ, పోలీసులూ తదితరులు వేచి ఉండడానికి అక్కడ కొన్ని కుర్చీలు ఉన్నాయి. వ్రాత కోతలకు రెండు బల్లలూ ఉన్నాయి. ఆ హాలును అంటిపెట్టుకుని ఉన్న గదిలోకి అడుగుపెడుతూ నమస్కారం సార్‌ అన్నాడు మహారుద్ర అక్కడ కుర్చీలో కూర్చొని తదేక దీక్షతో ఏదో రాసుకుంటున్న వ్యక్తిని ఉద్దేశించి. ప్రతి నమస్కారం చేశాడు అవతలి వ్యక్తి. అతడి పేరు ధర్మారావు.

ఆ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి అతడు సంచాలకుడు. దీర్ఘకాలంగా అక్కడే పాతుకుపోయి ఉన్నాడేమో సహోద్యోగులు అతడిని పీనుగుల ధర్మారావు అని వెక్కిరిస్తుంటారు. ఎన్నిసార్లు బదిలీ ఆదేశాలు వచ్చినా పైరవీలు జరుపుకుంటూ గుడిలో మూలవిరాట్టులా అక్కడే స్థిరపడిపోయాడు. అందుకు కారణం అక్కడ అతడికి వచ్చే పై సంపాదనే! పోస్టుమార్టమ్‌ నిర్వహించిన తరువాత శవాన్ని తెల్లటి బట్టలో చుట్టి సంబంధీకులకు అందచేస్తుంటారు. అయితే ఆ ఆస్పత్రికి ఏ కారణం చేతనో దీర్ఘకాలంగా తెల్లబట్ట సరఫరా కావడం లేదు. బట్ట బయటనుంచి కొనుక్కు రావలసిందే. వాళ్ళ సౌకర్యం కోసం ధర్మారావు తానులకొద్దీ తెల్లబట్ట కొని ఉంచుతాడు.

ఒక శవానికి చుట్టబెట్టే గుడ్డకు రెండొందల యాభై రూపాయలవుతుంది. కానీ అతడు మూడొందలు వసూలు చేస్తుంటాడు. రోజూ కనీసం అయిదారు శవాలకైనా పోస్టుమార్టమ్‌ జరుగుతుందేమో సాయంత్రం ఇంటికెళ్ళే సమయానికి జేబులో కనీసం మూడొందల రూపాయలైనా చేరుతుంటాయి. ఈ అదనపు సంపాదనవల్లనే అతడు పిల్లలిద్దరికీ కార్పొరేట్‌ పాఠశాలలో చదువు చెప్పిస్తున్నాడు. పీనుగులమీద వస్తున్న ఈ సంపాదనవల్లే ఇంట్లో రెండుపూటలా పుష్టికరమైన తిండి తినగలుగుతున్నాడు. విలాసంగా కింగ్‌సైజ్‌ గోల్డ్‌ఫ్లేక్‌ సిగరెట్‌ కాల్చగలుగుతున్నాడు. వారానికొకసారి రాయల్‌ సెల్యూట్‌ సేవించగలుగుతున్నాడు. మనసైనప్పుడల్లా ఖరీదైన వేశ్యలవద్దకు వెళ్ళగలుగుతున్నాడు.