సుబ్బారావుగారు రోడ్డుమీద నడుస్తున్నారన్న మాటేగాని ఆయన మనసు కుదురుగాలేదు. తన సంసార జీవితంలో ఈరోజు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. దాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. ఇంతకాలం ఎంతో ఉన్నతంగా బతుకుతున్నాననుకునేవారు. కానీ భార్య సుభద్ర మాటలు తలచుకుంటున్నప్పుడు గుండెల్లో కలుక్కుమన్న భావన కలుగుతోంది.‘తనేనా అలా మాట్లాడింది? అసలెలా మాట్లాడగలిగింది అలాంటి మాటల్ని? ఆమెను తనెంతగానో ప్రేమించాడే. ఆమే సర్వస్వం అనుకుంటూ బతుకుతున్నాడే. అలాంటిది అంతమాట ఎలా అనగలిగింది?
ముప్పయ్యేళ్ళ వైవాహిక జీవితంలో పుట్టిన ఇద్దరి పిల్లలు ఎవరి జీవితాలు వాళ్ళు బతుకుతున్నారు. ఇంక మిగిలింది తామిద్దరే! బతికినంతకాలం ఒకరికొకరు తోడూనీడగా బతకాలనుకుంటున్న ఈ సమయంలో ఎందుకు అలాంటి మాటలంది! తనంటే నమ్మకం లేదా? అంత నమ్మకం లేనప్పుడు ఇంకోరకంగా ఆలోచించవచ్చు కదా! మరెందుకలా మనసు గాయపరిచేలా మాట్లాడింది. తనకిప్పుడు యాభైఎనిమిదేళ్ళు. రెండేళ్ళలో రిటైర్ కాబోతున్నాడు. ఈ వయసులో ఏ మగాడికైనా ముఖ్యంగా తనలాంటి స్థితిలో ఉన్నవాడికి అలాంటి ఆలోచన వస్తుందా?మరి సుభద్ర ఎందుకలా ఆలోచించింది!’ఒక్కసారిగా ఉదయం ఇంట్లో జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది.
ఆదివారం కావడంతో తీరిగ్గా నిద్రలేచారిద్దరూ. హాల్లో కూర్చుని పేపరు చదువుకుంటుంటే సుభద్ర ఇద్దరికీ చెరోగ్లాసులో కాఫీ తీసుకొచ్చింది. కాఫీ తాగుతూ ఏవేవో మాట్లాడుకున్నారు. ఆ మాటల సందర్భంలో, ‘‘ఏమండీ మీకిప్పుడు ఎంత జీతమొస్తోంది’’ అని అడిగింది సుభద్ర.భార్యవంక ఆశ్చర్యంగా చూశారు సుబ్బారావుగారు.‘‘అదేంటి సుభద్రా అలా అడుగుతున్నావు. ఇప్పుడు జీతం సంగతి ఎందుకు గుర్తుకొచ్చింది?’’.‘‘అంటే మీ జీతం గురించి నేనడగకూడదంటారా’’.‘‘అబ్బే! అడగకూడదని కాదు నా ఉద్యోగమూ, నా జీతమూ నీకు తెలియనివి కాదుగా!’’.