బెలగాం మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు....కోర్టు బయట గారడీ సాయిబు ఆట మొదలై- చిలక జోస్యం శివయ్యా, అదృష్టపు రాళ్ళు అమ్ముకునే గురయ్యా గిరాకీల కోసం ఎదురు చూస్తున్నారంటే కోర్టువారు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ కి బెంచ్ దిగేరని అర్థం.ఆ వేళ కాగానే, అంతవరకు స్తబ్దుగా ఉన్న కోర్టు ప్రాంగణం- గట్టిగా విదిల్చిన ఖాళీ పంచదార బస్తా నుంచి చీమలు జలజలా రాలినట్లుగా ఒక్కసారిగా జనాలతో నిండిపోయింది. బ్రేక్ లో సేదదీరడానికి బార్ రూమ్ వైపో, మధ్యాహ్నం కేసులు లేకపోతే ఇళ్లకో వెళ్ళిపోయే ప్లీడర్లూ, వారి వెనక కేసుల కట్టలు చంకలో పెట్టుకున్న ప్లీడర్ గుమస్తాలూ, వారిని అనుసరిస్తూ ‘టౌట్లు’- అంటే కేసుల దళారులు, కక్షిదారులూ బిలబిలమంటూ బయటపడ్డారు..
ఆ రోజు గుంపులో, టౌటు గుంపస్వామి, అతని కొడుకు మన్మథరావు ఉన్నారు. కోర్టు వరండా నుంచి గేటు దాకా ఆలోచిస్తూ వచ్చిన గుంపస్వామి గేటు దాటగానే నిర్ణయం తీసుకున్నాడు. పక్కనే ఉన్న తన కొడుకు మన్మథరావుతో, ‘‘ఒరేయ్ మన్మథా ...అయిందేదో అయింది. సగం జుత్తు ఊడిపోనాది. ఇంకా ఆలీస్యం చేస్తే బోడి గుండైపోతాదిగానీ, పద....’’ అంటూ బయల్దేరించాడు.‘‘ఎక్కడికి నాన్నా?’’ అని మన్మథరావు అడక్కముందే ఎక్కడికెళ్ళాలో గుంపస్వామి చెప్పాడు. మన్మథరావు నీళ్ళు నమిలాడు. తటపటాయించాడు. అతనలా చేస్తాడని గుంపస్వామికి తెలుసు. అందుకే కొడుకు జబ్బ పట్టుకునిమరీ నడిపించాడు గుంపస్వామి.
ఇద్దరూ కలిసి బెలగాం సెంటర్ వరకు గబగబా వచ్చి, కుడి వైపు మలుపు తిరిగి అగ్రహారం వీథిలో అడుగుపెట్టారు. సరిగ్గా అప్పుడే గాలిబాబురిక్షా, వాళ్ళని దాటుకుని వెళ్ళిపోయింది. అందులో లేడీ లాయర్ రేణుక ఉంది. గుంపస్వామి, మన్మథరావు చూశారు. మెల్లగా అనుసరించారు. రిక్షా, వీథిచివర ఆగింది. లాయర్ రేణుక రిక్షా దిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది.