‘‘వచ్చే ఆదివారం మా దౌహిత్రుడి మొదటి పుట్టినరోజు. ఈ సాయంత్రం రాపాగారి భవనానికి వెళ్ళి ఆహ్వానించాలి. ఓ మంచి ఎర్ర, పసుపు, గులాబీల పుష్పగుచ్ఛాన్ని సిద్ధంగా ఉంచు. అందులో మామిడాకులు కూడా ఉండేటట్టు చూడు’’ అన్నాడు ప్రజానాయకుడు(ప్రపా) ఏవో కాయితాల్లోకి చూస్తూ.
‘‘సర్! పుష్పగుచ్ఛాల్లో క్రోటన్ ఆకులుంచుతారు కానీ, మామిడాకులు కాదు సార్! ఎంతలో తెమ్మన్నారు? ఈ మధ్య ధరలు బాగా పెరిగిపోయాయి. అయిదువందలకి పైగానే పలుకుతోంది!’’ అన్నాడు వెనక గుమ్మం దగ్గర నిల్చున్న బుల్లి సహాయకుడు. సమాధానం పరిచితమైన గొంతులోంచి రాకపోవడంతో, ప్రనా తలెత్తి వెనక్కి చూసి, ‘‘నువ్వెవరివి? ఎప్పుడూ చూడలేదు! అసలు నా గదిలోకి ఎలా వచ్చావు? ఇలా ముందుకొచ్చి నిలబడు. సెక్యూరిటీ ఎలా లోపలికి రానిచ్చింది? ఏయ్ సెక్యూరిటీ... ఇతనెవరు?’’ అని గట్టిగా అరిచాడు.కిటికీలోంచి అరుపు విన్న సెక్యూరిటీ గార్డు భద్రం ఏమైందోనని, ‘‘సర్! ఏమైంది?’’ అంటూ గుళ్ళు లేని తుపాకీతో లోపలికి బుల్లెట్ వేగంతో ప్రవేశించాడు.‘‘ఇతనెవరు? లోపలికి ఎలా రానిచ్చారు? ఇంతకీ నా సెక్రటరీ ఏడి?’’‘‘ఇతగాడు అమ్మగారి సెక్యూరిటీగార్డు కొడుకు సార్! బి.ఏ. పాసయ్యాడు.
మీ సెక్రటరీ గారిని, వారి సెక్యూరిటీ గార్డుని అమ్మగారు సితారా చీరల దుకాణానికి తీసుకుపోయారు. మనవడిగారి పుట్టినరోజుకి విశిష్ట అతిథులకి పెట్టడానికి కొత్తగా వచ్చిన ఆనందా–సునందా చీరలు ఓ పాతిక కొనడానికి తీసుకుపోయారు. ఈలోపుగా మీకేదైనా అవసరమొస్తే నోట్సు తీసుకోవడానికి, ఇతర పనులు చేయడానికి ఇక్కడ ఉంచి, నాతో చెప్పిపోయారు సర్! ఇతగాడికి శీఘ్ర లఘులిపిలో మంచి ప్రవేశముంది. మీ నోట్లోంచి మాట రాకమునుపే ఇతగాడి పెన్సిల్ పరుగులు తీస్తుంది. ఇంక వర్డ్ ప్రాసెసర్‌తో కంప్యూటర్ టైపింగ్ కళ్ళు మూసుకొని కొట్టేస్తాడు.’’‘‘పాతిక చీరలు కొనడానికే! లకారం వదుల్తుంది. ఈ మనిషికి బుద్ధీ, జ్ఞానం లేదు!’’ పైకే గట్టిగా అనేశాడు.‘‘సార్! లకారం సితారా వారికి చెల్లించడం కోసం కాదు, వదిలించడానికే అమ్మగారు తమ సెక్రటరీని కూడా తీసుకుపోయారు!’’‘‘సరేలే! నువ్వు బయట అఘోరించు. ఇవాళ నా ఇలాకా మనుషులు చాలామంది నాకోసం వస్తారు. వాళ్ళని వెనక కారుషెడ్డులో కూర్చోబెట్టి, మంచినీళ్ళిచ్చి వారేం తీసుకొచ్చారో తీసుకొని, వివరాలు రిజిస్టర్‌లో రాయి.’’