ఆయాసంతో వగరుస్తున్నాడు జీవాంకురం. ఒక్కోకాలికీ పదేసి కిలోరాళ్లు కట్టినంత బరువుగా పడుతున్నాయి అడుగులు. అయినా నడక ఆపటం లేదు. ఆపే అవకాశం లేదు. వీలైనంత తొందరగా, వీలైనంత వేగంగా, వీలైనంతదూరం వెళ్లిపోవాలి. ఆ దుర్గమకీకారణ్యంలోంచి తప్పించుకుని, జనవాసంలోకి చేరుకోవాలి. అప్పుడే ఈ భూమ్మీద నాలుగునూకలు మిగుల్తాయి. మిగుల్తాయా?! తెలియదు. కానీ, ఈ అడవిదాటి వెళ్లలేకపోతే మాత్రం ఖచ్చితంగా ఆయువు మూడినట్లే! ఎవరూ ఏం చేయనక్కర్లేదు, వెళ్లకుండా అడ్డుకుంటే చాలు, ప్రాణాలు అవే పోతాయి, నేడు కాకుంటే రేపు!
ఎవరు అడ్డుకుంటారు? తన వాళ్లే! తన వాళ్లేనా? నిన్నటిదాకా తనవాళ్లే, తన మాట శిరోధార్యంగా, తన బాట తమ బాటగా భావించి ఒదిగిన వాళ్లే!కానీ, ఇవాళ తను వాళ్లనుంచే తప్పించుకుని పారిపోతున్నాడు! ఇంతకన్నా విషాదం ఏముంటుంది? ఆయాసంతో వగరుస్తున్నాడు పరాంకుశం. ఉండేలుబద్దనుంచి వదిలిపెట్టిన రాయిలాగా దూసుకుపోతున్నాడు ఆ అరణ్యంలోకి. ఆయాసం అతడి వేగాన్ని నియంత్రించకలేకపోతోంది. వీలైనంత వేగంగా, వీలైనంత తొందరగా ఆ దుర్గమ కీకారణ్యం ఒడిలో ఒదిగిపోవాలి. జనావాసానికి దూరంగా జరిగి పోవాలి, తన వాళ్లకి దూరంగా...సుదూరంగా.తన వాళ్లేనా? నిన్నా మొన్నటిదాకా తనవాళ్లే.
నిజాలు తెలిసేదాకా తన వాళ్లే!నిజాలు తేటతెల్లమయ్యాక, ఇప్పుడింకావాళ్లని తన వాళ్లుగా భావించగలడా? వాళ్ల మధ్య తన ఉనికిని తనే భరించలేని స్థితిలో అక్కడే బతగ్గలడా? వాళ్లు బతకనిస్తారా?అందుకే, వారికి దూరంగా, ఊరికి దూరంగా, చెడుకే దూరంగా, ఇహ కాస్త ఫరవాలేదనిపించాక ఓ పెద్దచెట్టు మొదట్లో కూలబడ్డాడు. ‘‘నిజం చెప్పరా తొత్తుకొడకా, ఎవరి గోడౌన్లోకి మళ్లించేవు ధాన్యం?’’ ఉగ్రంగా అరుస్తున్నాడు భూషయ్య.పరాంకుశం వరండాలో నిలబడి బిక్కచచ్చి చూస్తున్నాడు.‘‘నాకేటీ తెలవదు బాబో, మీ కాళ్లకాడబడి బతికేవోణ్ణి. నాకు తెలిసి, మీ గింజ బయటకు పోనిత్తానా’’ ఏడుస్తున్నాడు వెంకన్న.