కుట్లు అల్లికలు చేసుకుంటూ కొడుకుని ప్రయోజకుణ్ణి చేసింది ఆ తల్లి. తనకు సహాయం చేసినందుకు కృతజ్ఞతగా అన్నయ్య కూతురికే కొడుకునిచ్చి చేద్దామనుకుంది. కానీ అందుకు అంగీకరించలేదు కొడుకు. మన ప్రాంతంకాని పిల్లను పెళ్ళిచేసుకొచ్చాడు. కాదనలేకపోయింది. కోడలికి తెలుగుభాష రాదని తెలిసి హతాశురాలైంది. ఆమె వివరాలు, అలవాట్లు, ఉద్దేశాలు తెలుసుకోవడం ఎలాగో? అని మథనపడింది ఆ తల్లి. కానీ జరిగిందేమిటంటే....

*********************

కాలం ఒక్కోసారి కాదు అనేకసార్లు మనల్ని తట్టి పలకరిస్తుంది. ఒక్కోసారి మనకు దూరంగా జరిగిపోతుంది. ఆ వివరణకు అర్థమే ఈ ఎదురుచూపు. ఎవరైనా వస్తారని ఎదురుచూస్తుంటే సమయమే కదలదు. అవేవీ లేకుంటే మాత్రం పరుగులు తీస్తుంటుంది. ఇప్పుడా అవసరం అమలకు వచ్చింది. సరిగ్గా ఆరున్నర అవ్వడానికి ఇంకా అరగంట టైముంది. అమలకు కంగారుగా ఉంది. ఈ అరగంట నిరీక్షణకు కారణం అంత పెద్దదేమీకాదు చిన్నదే. కాకుంటే మనసుకు పెద్దది. మనిషికి చిన్నది. అంతే! వీధివాకిటవైపు పదేపదే చూస్తోంది. జీవితంలో దాదాపు యాభైఏళ్ళు గడిచినా విసుగురాలేదు కానీ ఈ అరగంట మాత్రం అమలకు విసుగు కలిగిస్తోంది. గడియారంముళ్ళవైపు పదేపదే చూస్తోంది. ఇంత నిదానంగా కదిలితే ఎలాగూ అని కాలాన్ని మాటిమాటికీ నిందిస్తోంది. ఇక పది నిముషాలు, ఐదు, మూడు, రెండు, ఒకటి. ‘హమ్మయ్య ఆరున్నర!’ అనుకుని గది కిటికీలోంచి కాదు ఏకంగా వీధిలోకే వెళ్ళిపోయింది ఆగలేక అమల.

ఆరున్నరైందిగానీ తను అనుకున్నట్లు జరగలేదు. అయ్యో! ఇప్పుడెలా? ఆరున్నరదాటి పదిహేను నిముషాలు గడిచింది. ఇంకా రాలేదా అనుకుంటూనే తనలో తాను సముదాయించుకుంటోంది కూడా.ఎదురుచూసినంత మాత్రాన వెంటనే ఆరున్నరకు రావాలంటే ఎలాగు? ఏ ప్రయాణమైనా అనుకున్న సమయానికి రావాలంటే కాస్తంత కష్టమే మరి! అయినా ఎదురుచూపులు చూసే హృదయానికి వేగం ఎక్కువ కదా? అందుకే ఈ ఆదుర్దా తప్పదు. కంటిముందుకు వస్తోంది నల్లని కారు. బహుశా అదే అయి ఉంటుంది. ఆ! అదే! హమ్మయ్య! ఆ కిటికీ అద్దాల్లోంచి కనిపించేవాడు ఖచ్చితంగా తన కొడుకే! అనుకుంటూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరైంది. చీరకొంగు సరిగ్గానే ఉన్నా కూడా మరోసారి సరిచేసుకుంటూ మరింత ముందుకు వెళ్ళింది. ఆగిన కారులోంచి దిగుతున్న తన కొడుకును చూసిన అమల కళ్ళల్లో పట్టరాని ఆనందం కనిపిస్తోంది.

కానీ కోడల్ని తీసుకు రావడమే కాస్తంత దిగులుగా ఉంది. ఎలా ఉంటుందో? ఏ కులమో? చీర కట్టుకుంటుందా? అని ఆరాటం. ‘‘అమ్మా! నేను, నా కొలీగ్‌ భావన కిందటి వారం పెళ్ళిచేసుకున్నాం, అనుకోని పరిస్థితుల్లో వెంటనే పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది. లేకుంటే వాళ్ళ నాన్న వేరెవరితోనో పెళ్ళి చేయాలనుకున్నాడట. అందుకే కనీసం నీకైనా చెప్పేసమయం లేకపోయింది. నేను తీసుకున్న ఏ నిర్ణయమైనా నీకు నచ్చుతుందని నాకు తెలుసు. ఆ ధైర్యంతోనే నేనున్నాను. కోడలుతో సహా వస్తున్నాను’’ అని కొడుకు అన్నప్పటి నుంచీ ఒకటే బాధ. గుండెల్లో ఎవరో చెయ్యిపెట్టి కెలికినట్టుగా ఉంది. ఈ రోజుతో ఆ బాధకు రూపం కనిపిస్తోంది. సన్నని వెండి కలర్‌ జార్జెట్‌ చీరలో దిగిన కోడలు భావనను చూడగానే బాగానే ఉందనిపించింది. పెద్ద అందగత్తె కాకున్నా, ముఖం కన్ను, ముక్కు తీరువగా, సంసారపక్షంగా ఉంది. కారు దిగగానే అమల కాళ్లకు నమస్కరించింది భావన. ‘అత్తగార్లు పడిపోవడానికి అది చాలు’ అని తెలుసుకుందేమో నిజంగానే అమల మురిసిపోయింది. రామ్మా, అంటూ సాదరంగా లోపలికి ఆహ్వానించింది. కోడలు వస్తుందని తెలిసి అమల ముందుగా, ఇంటి శుభ్రతపైనే ఎక్కువ దృష్టి పెట్టిందేమో, ఇల్లు చాలా నీట్‌గా చూడముచ్చటగా ఉంది. చుట్టూ కలియజూస్తున్న భావనను తదేకంగా చూస్తోంది అమల.