జల్లువెలిసిన సాయంకాలం....మాసికలు వేసినట్లుగా అక్కడక్కడా మబ్బులు. వర్షం మళ్ళీ వచ్చేలా ఉంది. ఎగువున పార్వతీపురం టౌన్ వైపు నుంచి, దిగువున బొబ్బిలివైపు గాలి దమాయించి వీస్తోంది. నడిమధ్య తడి ఆరబెట్టుకుంటున్న బెలగాం సెంటర్ ఒక్కసారి తల విదుల్చుకుంది. గోల మొదలైంది. గోలీ సోడాలు కొట్టినట్లు ఈలలు. వాటికి తాళం వేస్తూ డప్పులు. ఈ సందడి మొత్తం దగ్గరలోనే గెడ్డ వీథి చివర జగ్గునాయుడు పూరింటి దాకా వినిపిస్తోంది.

‘‘రిక్సా పందెం అయిపోనాది గావాల.. ఆడు గెలిసిపోలేదు కద?’’ అనుకున్నాడు జగ్గునాయుడు.అలా అనుకుంటూ నులక మంచం లోంచి మెల్లగా లేచాడు. మోచేతుల మీద కూర్చున్నాడు. కొంచెం ముందుకు వంగి కాళ్ళకట్టు దగ్గర కర్ర అందుకున్నాడు. ఊత పట్టుకుని కిందకి దిగబోతే కుడిమోకాలు కలుక్కుమంది. ‘‘అబ్బా...’’ అని నొప్పిని పంట బిగువున దిగమింగుతూ ఒడుపు చూసుకుని దిగాడు జగ్గునాయుడు. దిగి,‘‘ఇల్లిక్కడ సెంటర్ దాకా ఎల్లొస్తానే..’’ పెరట్లో పనిచేసుకుంటున్న భార్య నరిసికి వినిపించేలా గట్టిగా ఆన్నాడు.

‘‘దెబ్బలింకా ఆరనేదు. ఒళ్ళు పచ్చి పుండైపోనాది. ఎందుకలా డేకురుకుంటూ ఎల్తావు? మాత్రలు ఎసుకున్నావు..సిటం తొంగో రాదా?’’ అంది నరిసి.‘‘నాకేటి అయిపోనేదు. దుక్కనాగున్నాను గానీ, ఎల్లి రానీ...’’ కర్ర సహాయంతో ఆచితూచి అడుగులు వేసుకుంటూ జగ్గునాయుడు మట్టి గడప దాటాడు. ద్వారానికి అడ్డంగా తడకను చేరవేసి, వీథిలోకి వచ్చాడు. ఇంటి పక్కనే రోడ్డు వార అతడి రిక్షా. చక్రాలూడిన యుద్ధ రథం లాగా పడి ఉంది. దాన్ని చూసి నిట్టూర్చాడతను. రాత బాగుండ బట్టి బతికి బయటపడ్డాననుకున్నాడు.