సూరిబాబు దుఃఖసాగరంలో ఈతకొడుతున్నాడు. అందుకు సూచనగా అతని నుదుటి గీతలుఅలలు అలలుగా కదులుతున్నాయి. మధ్యమధ్యలో నిట్టూర్పుల హోరు వినిపిస్తోంది.
అతని భార్య నాగలక్ష్మి పరిస్థితి కూడా ఏమంత భిన్నంగా లేదు. టీవీ సీరియల్ నుంచి వినిపిస్తున్న అరుపులు కూడా ఆమెలో ఉత్సాహాన్ని రగిలించడం లేదు. వారి ఏకైక సుపుత్రుడు రింకూ మాత్రం ఇదేమీ పట్టనట్టు, ముక్కులో వేలు పెట్టుకొని భౌతిక సుఖాన్ని ఆస్వాదిస్తున్నాడు.‘రేపటి నుంచి మనం స్కూళ్ల వేట మొదలుపెట్టాల్సిందే!’ అనుకుంటూ మరోసారి నిట్టూర్చాడు సూరిబాబు. తన పిల్లవాడి చదువు ఇంత ఉపద్రవంగా మారుతుందని సూరిబాబు ఊహించనేలేదు. ఏడో తరగతి దాకా ఎలా చదువుకున్నా ఫర్వాలేదనే అనుభవమూ, అభిప్రాయమూ తనవి. తన పిల్లల విషయంలోనూ ఇదే అమలు చేస్తే సరిపోతుందనుకున్నాడు. కానీ ఎప్పుడైతే రింకూని నర్సరీలో చేర్చాడో, అప్పుడే తన అభిప్రాయం ఆవిరైపోయింది. తన ఇంటి దగ్గర ‘చిట్టి గూడు’ అనే ప్లేస్కూల్ ఉంది. అందులో రింకూని చేర్పించిన సూరిబాబుకి, పిల్లవాడు రోజుకో మురిపాన్ని తీసుకువచ్చేవాడు.‘చిట్టి గూడు’లో హడావుడి మామూలుగా ఉండేది కాదు.
ఓ రోజు ఏదన్నా జంతువు వేషం వేసి పంపమనేవారు. ఇంకో రోజు పండో, కాయో, పంచెకట్టో వేసి పంపమ నేవారు. ఆ వేషాల్లో రింకూని చూసిన సూరిబాబులో పుత్రోత్సాహం కట్టలు తెంచుకు నేది. ఇక పండుగలూ పబ్బాలూ వస్తే సరేసరి! పంద్రాగస్టుకి రింకూ నాయకుడిలా ఊగి పోతూ ఇంటికి చేరుకునేవాడు, హోలీకి రంగులు పులుముకుని తయారయ్యేవాడు. ఆయా ఘట్టాలని ఫోటోలు తీసి ఫేస్బుక్లో పరిచి ప్రజల ఆశీస్సులు కోరేవాడు సూరిబాబు. చిట్టి గూడు అనుభవంతో ఏ తరగతిలోఅయినా సరే, చదువు మాంఛి హడావుడిగానే సాగాలన్న నిశ్చయానికి వచ్చాడు. ‘యూకేజీ’ పూర్తయిన వెంటనే రింకూని ఎక్కడ చేర్చాలా అని ఆ దంపతులు ధర్మసంకటంలో పడ్డారు.‘‘ముందు ఏ స్కూలుకి పోదాం?’’ తన మనసులో ఉన్న సందేహాన్ని సవాలుగా మార్చి విసిరాడు సూరిబాబు.
‘‘మన ఊళ్లో అన్నిటికంటే పెద్ద స్కూల్ ‘పిట్రమాక్స్ గ్రామర్ స్కూల్’ కదా! ఫీజు ఓ నలభై వేలు ఉంటుందనుకోండి. కానీ పిల్లాడి భవిష్యత్తు కోసం తప్పదుగా’’ అంటూ ఊరించింది నాగలక్ష్మి. తన స్నేహితురాళ్లు కొందరు, వాళ్ల పిల్లల్ని పిట్రమాక్స్ స్కూల్లో చదివిస్తున్న విషయం ఆమెకి బాగా గుర్తు. ఆ స్కూల్ గురించి చెప్పేటప్పుడు పిట్రమాక్స్ లైట్లా వెలిగిపోయే వాళ్ల మొహాలకి, చాలాసార్లు తన కళ్లు బైర్లు కమ్మాయి. ఇలాంటి అనుభవాలు సూరిబాబుకి కూడా ఉండటంతో, మర్నాడు ఆ స్కూలుకి వెళ్లేందుకు ఒప్పుకున్నాడు.