‘‘గత ఐదు సంవత్సరాలుగా నేను కొనుక్కుంటున్న మంచి మంచి చీరెలూ, చుడీదార్లనీ కొన్నాళ్ళే వాడుకుని మన పనిమనిషి లక్ష్మికి ఇస్తున్నానా... దానికెంతటెక్కో! ఒక్కసారంటే ఒక్కసారి కూడా అవి మనింటికి వేసుకురాదు చూశారా!’’ మా ఆవిడ తరచు తన అసంతృప్తిని నా దగ్గర వెళ్ళగక్కుతూ ఉంటుంది.‘‘నీ బట్టలు దాదాపు సరికొత్తగా ఉంటాయికదా సుజాతా! అలాంటివి ఆ అమ్మాయి ఏ పండగలకో, పబ్బాలకో, పొరుగూర్లు వెళ్ళినప్పుడో, చుట్టాలింటికి వెళ్ళినప్పుడో వేసుకుంటూ ఉండవచ్చు. పనిమనిషికి అంతంత ఖరీదైన బట్టలు ఇచ్చేసి నువ్వు డబ్బు దుబారా చేస్తున్నావని ఇరుగు పొరుగువాళ్ళనుంచి నీకు లేనిపోని కామెంట్లు వస్తాయని ఆ అమ్మాయి సంశయిస్తూ ఉండచ్చు. ఏది ఏమైతేనేం, నువ్వు సంతోషంగా ఇస్తున్నావు. ఆ అమ్మాయి మహదానందంగా తీసుకుంటోంది. అది చాలు మనకి’’ అని సర్ది చెబుతుంటాను.
‘‘అన్నీ మీరు చూసినట్టే చెబుతుంటారు రెడీమేడ్ సమాధానంగా’’ అంటుంది సుజాత.ఆమె మాటలకు నవ్వి ఊరుకుంటాను.‘‘ఎందుకో మీలాగా, అలా నవ్వడం నాకు చేతకావటం లేదు’’ అంటుంది సుజాత.‘‘నువ్వూ ట్రై చెయ్యి. అదేం బ్రహ్మ విద్యకాదు’’ అంటాను ఇంక మాట్లాడదు సుజాత. పనిమనిషి లక్ష్మి భర్త రాములు ఎక్కడో కార్లు రిపేరుచేసే షెడ్డులో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడని చెప్పింది సుజాత ఒకసారి.‘‘నా పాత ప్యాంట్లూ, షర్టులూ కూడా లక్ష్మికి ఇచ్చెయ్, వాళ్ళాయన వేసుకుంటాడు’’ అంటూ ఓ మూడు జతల బట్టలు సుజీతకిచ్చేనప్పుడు,‘‘అలాగే..’’ అని వాటిని ఒక సంచిలోపెట్టి లక్ష్మికిచ్చింది సుజాత. అలాగే ఆ ఆ తర్వాత ఓ రెండు మూడుసార్లు ఇచ్చాను.
‘‘నేనిచ్చిన బట్టలు పాడైపోతాయనో, మీరు చెప్పినట్టు చుట్టుప్రక్కలవాళ్ళు చూసి ఏదైనా అనుకుంటారనోగానీ లక్ష్మి మనింటికి అవి కట్టుకురాదు. ఇన్నాళ్ళూ మీరిస్తున్న ప్యాంట్లూ, చొక్కాలూ వాళ్ళాయన వేసుకుంటున్నాడని మీరనుకుంటున్నారు. కానీ అతగాడిది వాచ్‌మన్ ఉద్యోగం కాబట్టి మీ దృష్టిలో పాతవైనా, ఖరీదైన మీ బట్టలు లక్ష్మిమొగుడు వేసుకుంటు న్నాడనిగానీ, వేసుకుంటాడనిగానీ నేననుకోను. ఓవిధంగా ఇద్దరం అపాత్రదానం, అనవ సర దానం చేస్తున్నామనిపిస్తోంది నాకు’ రీసెర్చ్‌చేసి చెప్పినట్టు చెప్పింది సుజాత. ఓ సాయంత్రం మేము టీ త్రాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు.