ఒకానొకప్పుడు స్వరూపదేశాన్ని గుణవర్మ అనే రాజు పరిపాలించేవాడు. తన రాజ్యంలో పేదరికమన్నది మచ్చుకైనా ఉండకూడదని ఆయన ఆశయం. అందుకాయన చేసిన కృషి ఇంతా అంతా కాదు. ప్రజలకు కల్పించిన సదుపాయాలు ఇన్నీ అన్నీ కావు. ఆయన పాలనలో స్వరూపదేశం పౌరులకు భూతలస్వర్గంలా ఉంటోంది.
గుణవర్మ నిత్యం ప్రజాక్షేమం గురించే ఆలోచిస్తూ ఉండేవాడు. దేశంలో ఒక్క పౌరుడికి కూడా కష్టం కలగకూడదనీ, ఇప్పటి ఏర్పాట్లన్నీ ఎల్లకాలం కొనసాగాలనీ ఆయన కోరిక. ఒకరోజు రాత్రి అలాంటి కోరికతోనే ఆయన నిద్రకు ఉపక్రమించాడు. అప్పుడు కలలో ఆయనకు ఒక దివ్యపురుషుడు కనిపించాడు. ఆ పురుషుడు పట్టుబట్టలు కట్టుకుని ఉన్నాడు. అతడి శరీరం బంగారు రంగుతోటీ, ముఖం సూర్యతేజంతోటీ వెలిగిపోతున్నాయి. అప్రయత్నంగా ఆ దివ్యపురుషుడికి నమస్కరించాడు గుణవర్మ.‘‘గుణవర్మా! నిద్రా సమయంలోనూ పౌరుల క్షేమంగురించి ఆలోచించే నీవంటి రాజు - అన్నికాలాలకీ, అన్నిలోకాలకీ ఆదర్శప్రాయుడు. నీ రాజ్యం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కదా, నీ కోరిక! అది తీరాలంటే, వెంటనే బయల్దేరి నీ రాజ్యం సరిహద్దు ప్రాంతంలో ఉన్న భీకరారణ్యానికి వెళ్లు’’ అన్నాడా దివ్యపురుషుడు.
అప్పుడు గుణవర్మకి మనసులో ఎన్నో అనుమానాలు కలిగాయి. అడిగి తన సందేహాలు నివృత్తిచేసుకుందామనుకునేలోగా ఆ దివ్యపురుషుడు మాయమయ్యాడు. గుణవర్మకు చటుక్కున మెలకువ వచ్చింది. కళ్ళు నులుముకుని చుట్టూచూస్తే తను రాజాంతఃపురంలోనే ఉన్నాడు. పక్కనే మరో పట్టుపరుపుల మంచంమీద ఆదమరిచి నిద్రపోతోంది మహారాణి.ఆ కలని నమ్మాలా, నమ్మకూడదా అని కాసేపు ఆలోచించాడు గుణవర్మ. భీకర అరణ్యానికి వెళ్లడంవల్ల లాభం ఉంటుందో ఉండదో తెలియదు. కానీ వెళ్లకపోవడంవల్ల నష్టంకలిగే అవకాశముంది. బాగా ఆలోచిస్తే వెళ్లడమే మంచిదనిపించిందాయనకు.