‘‘తన ఖర్మకాండలు చక్రవర్తితో చేయించాలని కోరుకుంది. ఆ చక్రవర్తి ఎవరో ఆయనతో అమ్మకున్న ‘బంధం’ ఏమిటో తెలీదు’’ అంది సింధూజా. నేను ఆశ్చర్యపోయాను. నేను సుమిత్రకి ఆంతరంగిక స్నేహితురాలిని. నాకు ఎప్పుడూ ఈ చక్రవర్తి గురించే చెప్పలేదు సుమిత్ర.‘‘బహుశా మీ అమ్మగారి చివరికోరిక అయ్యుంటుంది. ఎందుకు చెప్పలేదో’’ అన్నాను పైకి.‘‘అమ్మ ఎందుకు కోరుకుందో తెలీదు. కానీ ఆ పాత్ర ను ప్రవేశపెట్టి అమ్మ జీవితానికి కళంకం తేలేక నేనూ చెల్లి ఆలోచించి ఖర్మకాండల బాధ్యత మేమే తీసుకున్నాం’’ అంది సింధూజ. అంతలోనే...
****************************
సుమిత్ర చనిపోయిందన్న వార్త నా మెదడును స్తంభింపజేసింది. కాసేపు సోఫాలో కూలబడ్డాను.సుమిత్ర కూతురు నీరజ చేసిన ఫోన్ కాల్‌తో నిద్ర లేచాను.‘‘ఎలా జరిగింది?’’ అడిగాను పీలగా. తెలియదు అంటీ. టెనెంట్ రవిగారు కాల్‌చేసి చెప్పారు. ఎకాఎకీన బయలుదేరి వచ్చాం’’ చెప్పింది నీరజ.
‘‘మీ అక్కయ్య వచ్చిందా?’’‘‘షీ ఈజ్ ఆన్ ద వే ఆంటీ..’’‘‘ఇంకా ఎవరికైనా ‘ఫోన్స్’ చేశావా’’‘‘అమ్మ ‘ముప్పై’ పేర్లు తన డైరీలో రాసుకుంది. అందులో మొదటి పేరు మీదే ఉంది’’ చెప్పింది నీరజ.‘‘ముప్పై పేర్లు రాసుకోవడమేంటి?..!’’ అడిగాను.‘‘అమ్మ ఆర్నెల్ల క్రితం బద్రీనాథ్ యాత్రకు వెళ్ళింది కదా. ఒకవేళ ఆ యాత్రలో తనకేమైనా జరిగితే, ప్రమాదవశాత్తు మృత్యువాత పడితే తన ఖర్మకాండలు ఎవరు చేయాలి, ఎలా చేయాలనే వివరాలన్నీ తన డైరీలో రాసుకుంది.’’ చెప్పింది నీరజ.సుమిత్ర ముందు చూపు మరింత ఆశ్చర్యపరచింది. అశోక్‌కి కాల్ చేశాను.ఆశ్చర్యం, ఆందోళన ముప్పిరిగొన్న ఫీలింగ్‌తో ‘‘అవునా..’’ అన్నాడు. ‘‘ఎస్..అశోక్ నాకూ ఇప్పుడే తెలిసింది. సుమిత్ర కూతురు చెప్పింది’’ నా స్వరంలో దు:ఖం పసిగట్టాడు అశోక్.
‘‘ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ వసూ’’‘‘మీరు వెంటనే రండి..’’ చెప్పాను. అశోక్‌ది రెవెన్యూ డిపార్ట్‌మెంట్. ఇటీవలి తుఫాన్‌కి విలవిలలాడిపోయిన విశాఖలో నష్టం అంచనా వేసేందుకు వెళ్లిన సిబ్బందిలో అశోక్ కూడా సభ్యుడు. ఆరోజే కేంద్ర బృందం కూడా వస్తోంది. అయినా అశోక్ ఆగదల్చుకోలేదు.సుమిత్రకు కడసారి వీడ్కోలు ఇవ్వాలని హుటాహుటిన బయలుదేరాడు.సుమిత్రకు ఋణపడిన వారిలో అశోక్ కూడా ఒకడు. సుమిత్ర లేకపోతే నా జీవితంలో అశోక్ ఉండేవాడే కాదు. నా పిరికితనంతో జీవితాన్ని ‘మోడు’ వారిన చెట్టులా చేసుకొనే దాన్ని.