బంగాళాఖాతంలో వాయుగుండం పడింది.రాష్ట్రమంతా వానలు. మాకు రేపటినుంచి వరుసగా వారంరోజులు సెలవులు. పీజీలో చేరాక ఇంతవరకు ఊరెళ్లలేదు. ఇంటిమీద దిగులేసింది.సాయంకాలానికి ఈదురుగాలి తగ్గింది. వాన తెరిపిచ్చింది. చెప్పులు కొనటానికి నేనూ, శ్రీశ్రీ (అవును ఇతని పేరూ శ్రీరంగం శ్రీనివాసే!) కలిసి మసీదు సెంటర్‌కెళ్లాం. టీలు తాగుతూ, ‘‘సెంటర్లో ఒక ‘పిట్ట’ కూడా తిరగటం లేదు చూశావా దొరా!’’ అన్నాడు శ్రీశ్రీ. చాలా బిజీ సెంటర్ అది.
‘‘ఈ వానలకు భయపడి మనంమాత్రం బయటికొచ్చామా?’’ అన్నాను ఖాళీకప్పు టేబుల్‌మీద పెడుతూ. ఈ సెంటర్‌కి ఈవినింగ్ ఆరు, ఏడు గంటలప్పుడు ఊళ్లో ఉన్న అమ్మాయిలంతా ఏదోవంకతో వస్తారు. ఇక్కడొక గంట నిలబడితే చాలు కాకినాడ మొత్తం చూసినట్టే.మూడునెలలకు కలిపి నిన్ననే స్టైఫండ్స్ ఇచ్చారు. నా మొదటి సంపాదనతో నాన్నకు చెప్పులు కొనివ్వాలన్న కోరిక ఇవ్వాళ నెరవేరబోతోంది. బాటాషాపులో బ్లూకలర్ స్లిప్పర్లు తీసుకున్నాను.
హాస్టల్‌కి చేరాక మహేష్, రమణరావు, శ్రీశ్రీతో కలిసి డైనింగ్ హాలుకెళ్లా. ఆ టైంలో మెస్ సందడిసందడిగా ఉంటుంది. హౌస్‌సర్జన్స్, పీజీలు లేడీస్, జెంట్స్ అందరికీ కలిపి ఒకే హాస్టల్. అందరికీ డైనింగ్, రీడింగు రూం కామన్.ఇక్కడ మెస్‌లో డిష్కషన్‌కి రాని టాపిక్ అంటూ ఉండదు. ఎన్టీఆర్ నుంచి రాజీవ్‌గాంధీ దాకా, దాసరి నుంచి బాలచందర్, భాగ్యరాజా దాకా...మేము ఒక టేబుల్‌దగ్గర సెటిలయ్యాం. అప్పటికే నాగూ గ్రూపు పక్కటేబుల్ దగ్గరచేరి సందడి సందడి చేస్తోంది. అతనేసే నాన్‌వెజ్ జోకులకు అమ్మాయిలు కూడా నవ్వుకుంటారు.