ఊరంతా సద్దుమళ్లిన ఆ యాల, యాడో దూరెంగున్నె కాశినాయన ఆస్రమంలోంచి తాళాలతో కలిసిపోయ్న భజనలు మైకులోంచి వినిపిస్తా వుండాయి.
‘‘అమ్మ ర్రో దం.. డా... లుఓ తల్లీ పోలేరూ...వొక్కసారి కనిపించి మగిమలు సూపెట్టు..ల్యాకుంటే బమ్మయ్యనిపిలవాల్న శెప్పు..అమ్మా ..... అమ్మ రో.. ’’
బాగా బంగాకు తిని ఎదురుమల్లున్నె సత్రంలో బడుకున్నె సాధువెవరో గొంతెత్తి ముద్ద ముద్దగా పాడతన్యాడు.కటాంజనంలో మంచం కోడుపై తలపెట్టి దిగాలుగ పడుకున్నెది శాంతి. దగ్గిరకొచ్చిన తల్లి పోలమ్మ, గడపమానుకు ఆనుకుని కుచ్చుని ‘‘మద్దెనం నువ్ గొర్లుకొట్టంలో ఉన్నెపుడు ఈరయ్య మామొచ్చిపోయిండాడు మే!’’ అనింది మెల్లింగా తలొంచుకుని.ఆమెకి తలెత్తి బిడ్డ మొగంలో గమ్ముకున్నె మోడాలని జూసే ధైర్నం లేదు. అవి ఇబుడో ఇంగా రొంసేపటికో కొంపని ముంచే వరద అవుద్దనిపిచ్చానే వున్నెది.‘‘ఏమిటికంటా?’’ విసుగ్గా అన్నెది శాంతి తలెత్తకుండానే.‘‘ఏం ల్యా! నిన్ను కాపరాన్కి అంపమని నీ మొగుడు చెప్పంపినాడు. నా మాటగాదుగానీ రోంత నిమ్మలంగా ఆలోచించు మే.
కాపరమన్నాక కొట్టడం, తన్నడం మామూలే. మేం మాత్రం ఇన్ని దినాలు మారాణీ తీర్ల వున్నెమా? మీ నాయన మట్టికీ నన్నేమైనా నెత్తిన బెట్టి జూసుకున్యాడా? సర్దుకుపోవల్లా. నీ ముగ్గురు ఆడిపిల్లల మొగంజూసైనా రోంత మెత్తబడు తల్లీ’’ అనేతల్కి శాంతి తల్లిపై విరుచుకుబడింది.‘‘మా నేను అసల్కి మీ బిడ్డనేనా? ఎట్లా మనసొచ్చాంది మీకు మళ్లా ఆడికిబోమని జెప్పనికి. సూస్తివే వాడు వాతలుబెట్టని తావేమైనా వున్నెదా? వాడు నన్ని జేయని హింసలేమైనా వుండాయా? అసలు నా బిడ్డల మొగంజూసి గాదు ఈటికొచ్చినా. కడుపులో దాపెట్టుకుని జూచ్చారంటే మీరే మళ్లా ఆ కాపరం జేయమంటాండరే! ఆ యప్పకి లెక్క గావాలంట లెక్క. సారికి నేను యాట్నిండి త్యావాల మా? పొద్దంత తాగేదానికి బొయ్యేది. మాటేలయ్యేటాల్కి కొంపకొచ్చి ఇది త్యావాల, అది గావాలంటా నన్ను నా బిడ్డలను కొట్టి సచ్చేది. ఎట్టామా వానితో కాపరం? సచ్చేంత పిరికి గొడ్డుని గాదు గాబట్టి ఇట్ట ఇంగా ఈ రోజు మీ కండ్ల ముందరుండ’’ అంట ఆవేశంగా, ఆవేదనతో రగిలిపోతాండే బిడ్డను జూసి ఎనక్కితగ్గింది పోలమ్మ.