ఒక ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ రిప్రజెంటేటివ్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన తరువాత ఆరోగ్యంమీద శ్రద్ధపెరిగిందో, లేక ఖాళీ సమయం దొరికిందో సరిగా తెలియదుగానీ ఉదయం–సాయంత్రం కూడా వాకింగ్‌కి వెళ్ళడం మొదలుపెట్టాను. అమ్మా నాన్న ఉన్నంతకాలం మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. వాళ్లు కాలంచేశాక ఇంటి బాధ్యత నామీద పడింది. నాకు ఒక్కర్తే కూతురు. దాని చదువు అయిపోగానే పెళ్ళి కూడా చేసేశాం. నేను, నా భార్య ఉండటానికి సొంత ఇల్లు ఉంది. దాంట్లో కొంతభాగం అద్దెకు ఇచ్చాం.
రిటైర్మెంట్ బెనిఫిట్స్‌లో కొంత నా కూతురు పెళ్ళికి ఖర్చు అయిపోగా మిగిలింది బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్ చేశాం. దానిమీద వచ్చే వడ్డీ, అద్దె డబ్బులతో మేమిద్దరం కాలం గడుపుతున్నాం. అంతవరకూ బాగానే ఉంది. కానీ,‘‘ఆ ఊళ్లో మీరిద్దరూ ఒంటరిగా ఉండటం ఎందుకు? ఆ ఇల్లు అమ్మేసి మీరు కూడా మా దగ్గరికి వచ్చేయకూడదు నాన్నా’’ అంటూ మా అమ్మాయి ఒకరోజు ఫోను చేసింది.‘‘ఇక్కడ మాకు బాగానే ఉంది కదమ్మా’’ అన్నాను.‘‘మీలో ఎవరికేనా ఒంట్లో బాగులేకపోతే రెండోవాళ్లకి చేసే ఓపిక లేదుకదా, ఇక్కడ నాతో కలిసి ఉండడం ఇష్టం లేకపోతే వేరే ఇల్లు అద్దెకు తీసుకుని ఉండవచ్చు.
నేను మీకు దగ్గరగా ఉంటే సాయం చెయ్యడానికి నాకు వీలుగా ఉంటుంది’’ అంది మా అమ్మాయి.‘‘అవుననుకో, కానీ ఇప్పుడు మా ఆరోగ్యాలకేమీ ఇబ్బంది లేదుకదమ్మా, అంతగా అవసరం వచ్చినప్పుడు చూద్దాంలే’’ అని తోసిపుచ్చాను. ఈ విషయంలో మా ఆవిడకి ప్రత్యేకమైన అభిప్రాయం లేకపోవడంతో ఆ తలనొప్పి నాకే చుట్టుకుంది. పట్టువదలని విక్రమార్కుడిలా నాలుగురోజుల తరువాత మళ్ళీ మా అమ్మాయి ఫోను చేసింది. ఈ మారు బ్రహ్మాస్త్రం సంధించింది. అదేవిటంటే ‘‘ఇక్కడికి రావడం మీకు ఇష్టంలేదేమో అంటున్నారు మీ అల్లుడుగారు’’ అంది.