వినీల తన గదిలో కూచుని హోంవర్క్ చేస్తుందన్న మాటే గాని ఆమె మనసంతా స్కూల్లో లెక్కల మాస్టారు చెప్పిన విషయం మీదే కేంద్రీకృతమై ఉంది. తనిప్పుడు పదో తరగతి. క్లాసులు మొదలై రెణ్ణెల్లు. నెలవారీ పరీక్షల్లో లెక్కల్లో నూటికి ఇరవై మార్కులు దాటలేదు.‘‘ఇలాగైతే పబ్లిక్ పరీక్షల్లో పాస్ కావడం కష్టం. నా ట్యూషన్లో చేరితే ప్రయోజనం ఉంటుంది. సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది వరకు ట్యూషన్ ఉంటుంది. మీ ఇంట్లో చెప్పి రా. ఫీజు విషయం మీ నాన్ననొచ్చి మాట్లాడమను’’ అన్నాడు లెక్కల మాస్టారు గురుమూర్తి.తన క్లాస్‌లో చాలామంది మాస్టారి దగ్గర ట్యూషన్ చెప్పించుకుంటున్నారు. తనకూ వెళ్ళాలనే ఉంది. స్కూల్ నుంచి రాగానే అమ్మతో విషయం చెప్పింది.‘‘క్లాస్‌లో మాస్టారు పాఠం చెప్పేటప్పుడు శ్రద్ధగా వింటే మార్కులు ఎందుకు రావూ? జీతాలు తీసుకుంటున్నది చాలక ట్యూషన్ల మీద వేలకు వేలు సంపాయించాలని టీచర్లు ఆడే నాటకాలివి. నాకెందుకు తెలీదూ ... మా రోజుల్లోనూ అంతే. ఎక్కువ మంది తన దగ్గరకే ట్యూషన్‌కి రావాలని స్కూల్లో అరకొరగా పాఠాలు చెప్పి, ట్యూషన్లో చేరిన వాళ్ళకి ఎక్కువ మార్కులు వేసేవాళ్ళు. ట్యూషన్ వద్దూ ఏమీ వద్దు. ఇంట్లోనే బుద్ధిగా చదువుకో’’ అంది మాలతి.
నాన్న రాక కోసం ఎదురుచూస్తోంది. నాన్నయితే తన మాట వింటాడని వినీల నమ్మకం. అమ్మలా అడ్డంగా వాదించడు. తనేం చెప్పినా చక్కగా అర్థం చేసుకుంటాడు. లెక్కలంటే తనకెంత భయమో నాన్నకు తెలుసు. ఆల్‌జీబ్రా అంటే మరీ భయం.‘‘నాక్కూడా లెక్కలంటే వణుకొచ్చేది తెలుసా. మా నాన్న ట్యూషన్‌కి పంపించబట్టి బొటా బొటి మార్కుల్తో టెన్త్ పాసయ్యా. అందుకే ఇంటర్ డిగ్రీల్లో హిస్టరీ ఎకనామిక్స్ లాంటి సజ్జెక్టులు ఎన్నుకున్నా’’ అని నాన్న చెప్పటం గుర్తొచ్చి వినీల నమ్మకం మరింత బలపడింది.రాత్రి ఎనిమిది దాటాక రాజారాం ఇంటికొచ్చాడు. వెంటనే ట్యూషన్ విషయం కదపడం మంచిది కాదని, భోజనాల సమయం వరకు ఎదురుచూసింది. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూచున్నాక ‘‘నాన్నా.. నేను లెక్కల మాస్టారి దగ్గర ట్యూషన్లో చేరతాను. లేకపోతే ఫెయిలవ్వటం ఖాయం’’ అంది.