‘‘నీ జత పచ్చి’’ సముద్రంకేసి తిరిగి కుడి ఎడమ చేతుల చూపుడు వేళ్ళతోపచ్చి కొట్టి చిన్నా వెనక్కి తిరిగాడు.‘‘అరే, అలా అనకురా.. పోవద్దురా’’అంటూ సముద్రం హోరు పెట్టింది. చిన్నా కరిగి పోయాడు. పరిగెట్టుకుంటాసముద్రం అలమీద పడి ఒళ్లంతా తడిపేసుకున్నాడు.

కాసేపు అలాగే సముద్రంతో ఆడుకొని బడికి సమయం అవుతుందని ఇంటికి పరిగెత్తాడు. ఇప్పుడు మూడో తరగతి. పిల్లలతో సావాసం బడిలో చేరాకే. సముద్రంతో సావాసం ... అడుగులు వెయ్యడం నేర్చిన దగ్గరినుండే.ఎప్పుడో ఓ సారి, అంటే బాగా పసి వాడప్పుడు అమ్మ ఎండబెట్టిన తాటాకు చేప కాల్చి చిన్నాకి తినబెట్టింది. కమ్మటి ఎండుచేపలు. తినగా తినగా ఇంకా తినాలనే ఆశ పిల్లాడిలో. రెండు తినిపించి మిగతావి పైన బల్ల మీద ఎత్తిపెట్టింది. చిన్నాకి ఇంకా తినాలనిపించింది కానీ వాడికి అందలేదు.ఇంకోటి కావాలని పైకి చూపించి సైగలు చేశాడు.‘‘ఒద్దు. పొట్టలో నొప్పి చేస్తది.. కాసేపాగి’’ అమ్మ సాగదీస్తా, గారాబం చేస్తా చెప్పింది. కానీ వాడికి గారాబం కాదు, కాల్చిన ఎండు చేప ముక్క కావాలి.అమ్మ ఇవ్వలేదు. చిన్నా అలిగాడు. అయినా ఇవ్వలేదు. రోషం పుట్టి జారిపోతన్న చెడ్డీ పైకి లాక్కుని సముద్రం దిక్కుకి నడస్తా వచ్చేశాడు. అమ్మ వాడు కనబడక ఆగాలు బోగాలు అయిపోయి ఏడస్తా వీధిలో పరిగెత్తింది.

కనబడిన పిల్లనీ, తల్లినీ అడిగింది. ఎవరో చెప్పారు, చిన్నా సముద్రం దిక్కడకి తప తపా పరిగెత్తి వెళ్ళాడని. తూర్పుకి పరిగెత్తింది.చిన్నా సముద్రం వంక తిరిగి ముక్కుల్లోనించీ, కళ్ళల్లోనించీ నీళ్లు కారస్తా ఏడ్చాడు. వీడి ఏడుపుకి సంఘీభావంగా సముద్రం కూడా ‘ఓ’మని గోస చేసింది. ఇంక రెండడుగులువేస్తే పిల్లాడి పాదాలు అలల్ని తాకేస్తాయి. నాలుగడుగులు వేస్తే?‘‘రే, బుడకా’’ సముద్రం వొడ్డున గుంపులా చేరిన నలుగురు పిల్లల్లో ఒకడు చిన్నాని చూశాడు. కేక వేశాడు. కడలి సద్దుని తోసి రాజంటా ఉంది ఆ కేక. పట్టపు పాలెం పిల్లోడా మజాకా. కేక పెడితే సముద్రం సిగ్గుపడి వెనక్కి పోతది, తను వాళ్ళంత గట్టిగా శబ్దం చెయ్యలేక పోతందని.