‘‘ఇది ఫిజిక్స్ పేపరనుకున్నావా? ఏదన్నా సినిమా పజిలనుకున్నావా! నీ ఇష్టమొచ్చినట్లు పూర్తిచేయటానికి! క్వశ్చన్ పేపరును మనసుతో చదివి కళ్ళు తెరుచుకునే వ్రాశావా? కళ్ళు మూసుకుని వ్రాశావా? ఇచ్చిన ప్రశ్నలేంటి? నువ్వు వ్రాసిన జవాబులేంటి? మేమంతా గొంతులు చించుకుని, గంటలకొద్దీ నిలువుకాళ్ల మీద నుంచొని మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అదంతా ఎవరికోసం? రూమ్‌లోని గోడలకూ, కిటికీలకూ, తలుపులకా? మేమంతా మనుషులకు పాఠాలు చెబుతున్నామనుకుంటున్నాం. నువ్వు మనిషివి కాదా?
నామట్టుకు నేను జలుబు కూడా చెయ్యికూడదని ఐస్‌క్రీం తినటం మానేశాను. ఎక్కడ వేడిచేస్తుందోనని చపాతీల లాంటివి కూడా తినకుండా, నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ఎంతో సబ్జక్టు మీ బుర్రల్లోకి ఎక్కించాలని తిండి కూడా సరిగా తినకుండా ఎంతో పాకులాడుతున్నాను. ఇంతచేస్తే, దానికి నాకు దొరికిన ప్రతిఫలం ఇదా!’’ అంటూ స్లిప్‌టెస్ట్ వ్రాసిన ఫిజిక్స్ పేపరును విసిరి భార్గవి ముఖాన కొట్టారు ఫిజిక్స్ సారు.ఆ తరగతిగదిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే ముప్ఫైమంది బైపీసీ గ్రూప్ విద్యార్థులున్నారు. వాళ్లకు ప్రతి సబ్జక్టులోనూ వారం వారం స్లిప్ టెస్టులు పెడుతున్నారు. రెసిడెన్షియల్ కాలేజ్ కావడంవల్ల ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. భార్గవి డేస్కాలర్. ఇప్పుడు క్లాస్‌లో తన తోటి వారందరిముందూ ఇలా తిట్టటం వలన ఆమెలో ఏడుపు తన్నుకొచ్చింది.
ఎప్పుడూ ఎవరిచేతా ఇలా మాటలు పడలేదు. ‘ఎంత ఘోరంగా తిడుతున్నారు?’ అంటూ తనలో తనే విలవిలలాడిపోయింది.‘ఇలా అరవడంకన్నా తనను దగ్గరకు పిలిచి తను ఎక్కడెక్కడ జవాబులు తప్పుగా వ్రాసిందో చెబితే బాగుండేది కదా? నేనిక్కడ స్టూడెంట్ను కనుక పైకీ ఏమీ అనుకోకూడదు. ఈ ఫిజిక్స్ సార్ క్లాస్ అంటేనే తనకు గుండె దడ. ఎప్పుడు ఎలాంటి మాటల ఫిరంగులు పేలుస్తారోనని భయపడుతూ ఉంటుంది తను. దాంతో తెలిసిన జవాబులు కూడా సమయానికి గుర్తుకురాకుండాపోతున్నాయి. ఈయన్ను అందరూ చాటుగా ‘టైగర్’ అని పిలుస్తారు. నిజంగా టైగరే అనుకుంటుంది తను’.