ఆవేళ నేను రైలెక్కేసరికి ..తగూ అంటే తగూకాదు.. పెద్ద గొడవ.. కేకలు ... అరుపులు.. ఇరుబాల వెంకటేశ్వరి, పసగడుగుల దేవమ్మ మామూలుగా లేరు. బరిలోకి దూకించిన కోడిపుంజుల్లా ఉన్నారు. కాళ్లకి కత్తులే తక్కువ. వాటిని నోటికి కట్టేసుకున్నట్టు రాలిపోతున్నారు. కసాకసా మాటలపోట్లు పొడుచుకుంటున్నారు.
‘‘నువ్వొల్లకోయే నాయార్లా. నీ బతుకేటో నాకు తెల్దేటి. ఎంతమందికెల్లినావో ఎందర్ని మాపినావో’’ దేవమ్మని దెప్పుతోంది వెంకటేశ్వరి.‘‘వొలే ఎంకమ్మా.. నానెంతమందికెల్లినా నీనాగ రోడ్డుమీద పడిపోనేదునేవో’’ శెటాయించింది దేవమ్మ.‘‘నీ పెనివిట్ని ఊరి మొగుళ్ల సేత సంపించీనేదేటి?’’ వెంకటి పుల్ల విరిచింది.‘‘నువ్వేటి తక్కువ కోడివేటి. మొగుణ్ని మందెట్టీసి కునికించీనేదా’’ దేవితల్లి దెయ్యంలా పడిపోయింది.ఊపిరి సలపనట్టుగా కాకరబీకరగా తయారయింది కంపార్టుమెంటు. రోజూ అనకాపల్లిలో ఉదయం ఏడున్నరకి కాకినాడ పాసింజరెక్కుతారు దేవీ, వెంకటేశ్వరీనూ. వీళ్లేకాదు, వీళ్లతో పాటు మరో ముప్ఫయిమందివరకూ ఆడమలారమూ ఈ బండి పట్టుకుంటుంది. అంతా బోడెమ్మలే. పూర్వ సువాసినులు. ఏభై దాటినవాళ్లు. అందరిదీ ఒకటే ఊరు. ఒకటే జోరు. ఒకటే బట్ట. ఒకటే కట్టు. బొట్టు మాత్రం ఎవళ్లకీ ఉండదు.
గంజిపెట్టి ఇస్త్రీ చేసిన ఆకాశంరంగు చీరలు చుట్టుకుని, అవే రంగు జాకెట్లు కట్టుకుని, లేత నీలంరంగు యూనీఫారాలతో ముసలిహంసల్లా అవుపిస్తారు. విశాపట్నం రైల్వేస్టేషన్లో బిలబిలమని దిగిపోతుంటారు.అన్నట్టు చెప్పకేం! వీళ్లందరూ ఎవరి కాళ్లమీద వాళ్లు నిలబడుతున్న స్వతంత్ర మహిళలు. ఘనతవహించిన ఇప్పటి బీఎస్ఎన్ఎల్లో కొలువు చేస్తున్నారు. వీళ్లల్లో అటెండర్లున్నారు. స్వీపర్లున్నారు. తోటమాలినిలున్నారు. అందరూ కిందతరగతి ఉద్యోగులే. అయినా పేస్కేళ్లకి తక్కువుండదు.‘‘మన పక్కన తోటవరం లేదూ. ఆ పల్లెటూరినించి పారొస్తార్రా ... పొద్దున్నే కడుపు బద్దలయ్యీలా తినీసి కేరేజీలు ఊపుకుంటూ వచ్చి పడిపోతారు. పేలాపన పేల్తుంటారు.
ఏలినవారి దత్తపుత్రికలు’’ ఇదీ కొత్తవారెవరికయినా వీరిని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు పలువురు డైలీపాసింజర్లు నొక్కే సన్నాయి నొక్కులు.ఈ రోజున వెంకటికీ దేవికీ రంధి పడిందిగానీ అనుదినమూ ఏ ఇద్దరి మధ్యనో ఏదో యుద్ధం జరిగిపోతూనే ఉంటుంది. ఈ జగడాలకి కారణాలూ చిత్రంగానే ఉంటాయి. అమాసనాడు అట్టెట్టలేదని పున్నంనాడు బూరెట్టలేదని మొదలవుతాయి. రంకుల దాకాపోతాయి. ఆఖరికి ఎవరో కలగజేసుకుని తుళ్లకసుళ్లు కసిరితే కాల్పుల విరమణ జరుగుతుంది. ఈ దినం ఆ కసురుడు బాధ్యత సత్యవతి తీసుకోవలసి వచ్చింది.