సంగీతం పుట్టకపుట్టాడతను. అంటే గొప్ప సంగీత విద్యాంసుడు మాత్రం కాదు. సంప్రదాయ సంగీతంలో ఓలలాడుతూంటుందతనిమనసు. తన ఇల్లు సంగీతనిలయమై అందులోనే తడిసిముద్దైపోవాలనీ అతడి ఆకాంక్ష. ఆ కాంక్షకు తగ్గట్టే నాదమూర్తీ, లయభాస్కరం తారసిల్లారు. ఆ ఝురిలో అతడికి కాలం తెలియలేదు. కానీ సంసారంమాత్రం హిరణ్యకశిపుడిపై భక్తప్రహ్లాదుడిలా అతడిపై తిరగబడింది!!
వినాయకరావుకి సంగీతం వినడమంటే అభిమానం అని కొందరు అనుకుంటారు. భార్య, కొడుకు మాత్రం అదొకస్థాయిలోని పిచ్చిగా వినాయకరావుకి పట్టిందని ఖరారు చేసుకున్నారు. ‘ఇల్లు ఆయనది. గది ఆయనది. ఆయనగదిలో ఆయన కచేరీల రికార్డింగులూ, రికార్డులూ పెట్టుకుంటూ ఉంటాడు. మనకేం పోయింది!’ అనే వైరాగ్యస్థితికి వినాయకరావు కుటుంబం వచ్చింది.అక్కడే ఆయన కుటుంబంతోనూ, ఇతర ప్రపంచంతోనూ విభేదించాడు. ‘‘వై? రాగస్థితి లేకపోతేందేం? ఈ ప్రపంచంలో?’’ అని ఆయన ప్రశ్న. దీనినే సంగీతకచేరీకి వెళ్ళని ఒక సాయంత్రం జయ అనే భార్యకీ కుమారం అనే ఇంజినీరింగ్చదివే కుమారుడికీవేసి, సమాధానం తానే చెప్పాడు. ‘‘అనురాగ స్థితిలేదు దేశాల మధ్య. ప్రతిపక్షానికి విరాగస్థితిలేదు, మళ్ళీ ఎన్నికలదాకా పోరులేదుకదా! విరాగుల్లా ఏడవవచ్చు’’ అన్నాడు.
ఆయనది ‘వై’ అనే ఒకానొక రాగస్థితిలో ప్రపంచమంతా సుభిక్షంగా యుద్ధాలు లేకుండా ఉంటుంది అనే ప్రగాఢ నమ్మకం. తిన్నగా ఉండక కుమారం ‘‘ఆ రాగానికి స్వరాలు ఆరోహణ అవరోహణలు...స్కేలింగ్!’’ అని అడిగాడు. ‘‘అలా అన్నావు బాగుంది’’ అని వినాయకరావు మొదలెట్టాడు. ‘‘ధేనుకరాగం ఉంది. దాని ఆరోహణల అవరోహణలతో...’ భార్య అడ్డు వచ్చింది. ‘ఆయీల మురళి పరిశోధనలు మనకెందుకు? మీరాగస్థితి ట్రంపు అధ్యక్షుడికి అర్థమవుతుందా! ధేనుక మూర్చన పుతిన్‌కి తెలుస్తుందా? వాళ్ళిద్దరికీ అర్థంకాని రాగంలో శాంతి ఉంటుందా?’’ అని పేపరు మడిచి విసుగు ప్రదర్శించి వెళ్ళిపోబోయింది జయ. ‘‘వివాదిస్వరాలు పరిచయమయ్యాయంటే సంగీతం పిల్లలు ఇక సర్వనాశనమయిపోతారు!’’ అని కొడుకు వినాలని పైకే అన్నాడు వినాయకరావు.‘ఏం! ఇళయరాజాకేం తక్కువ వచ్చింది!’ అన్నాడు కుమారం.‘వాణ్ణి ఈ శాస్త్రీయం చర్చలోకి రానీయకు’ తండ్రి. ‘అపస్వరాలు పనికొస్తే రంజికంగా ఉంటే ఏమైనా మొక్కుతారు!’ అని కుమారం తీర్పు చెప్పాడు.