సంధ్యవేళ...పడమట దిక్కున ఆకాశం ఎర్రగా ఎవరో భయంకరంగా హత్య కావింపబడినట్టుగా ఉంది. సుభద్ర పెరట్లోవున్న రుబ్బురోట్లో గారెలపప్పు రుబ్బుతూ ప్రయాసపడుతోంది. కాస్తదూరంలో జామచెట్టుకింద వాలుకుర్చీలో ప్రశాంతంగా కూర్చుని పేపర్లో ఉదయం చదవగా మిగిలింది ఏమైనా ఉందా అని చూస్తున్నాడు శేఖరం. కాస్సేపు పేపర్ అటూ ఇటూ తిరగేసి, -‘‘ఏమోయ్ అయ్యిందా?’’ అడిగాడు రుబ్బురోలు దగ్గరున్న సుభద్రవైపు చూడకుండానే.
‘‘తినడానికి మాత్రం రుచిగా ఉండాలి. రుబ్బేదాకా కాస్తంత ఆగలేరూ...’’ సాగదీసింది సుభద్ర.నిజానికి అక్కడ ఆయనకి పని లేకపోయినా ఆ కాస్త శాటిస్ ఫాక్షన్...అదే, ‘తోడుండటం కూడా చెయ్యకపోతే’ తిన్నగారెలు అరిగేవరకూ తన విసుగంతా రికార్డుచేసి గ్రామ్ఫోనులో వినిపిస్తూ ఉంటుంది సుభద్ర.‘‘కానివ్వు సుభద్రా! దోమలు కుట్టి చంపేస్తున్నాయి’’.‘‘మరే! మిమ్మల్నే మరి చంపేది. నన్ను దారుణంగా మర్డర్ చేస్తున్నాయి’’ పొత్రంపిడిని వదిలి చేతులు తిప్పుతూ చెప్పింది సుభద్ర.‘వెధవది గారెలు తినాలంటే గంట కష్టపడాలి. అదే నమిలి మింగటానికి పదినిముషాలు కూడా కష్టపడాల్సినపని లేదు. అమ్మో ఇంక తిండిధ్యాస తగ్గించుకోవాల్సిందే’ గట్టిగా నిర్ణయించుకున్నాడతను.శేఖరం కోర్టులో గుమస్తాగా పనిచేస్తూ చూసిచూడకుండా నొక్కేసిన దానితో సిటీకి దూరంగా తక్కువరేటుకు మూడుసెంట్ల ఫ్లాటు కొనుక్కున్నాడు.
అప్పటికే అక్కడక్కడా కొన్ని గుడిసెలు, రేకులషెడ్లు వేసుకుని ఉన్నవాళ్ళు ఎంతో కొంత ఇచ్చుకుని స్థలం తమది అనిపించుకున్నారు.శేఖరం రెండు బెడ్రూములతో చిన్న డాబాఇల్లు కట్టుకున్నాడు. పొల్యూషన్ లేదు. ప్రశాంత వాతావరణం. పిల్లలు కాలేజీ చదువులకు వచ్చేయడంతో ఇద్దరికీ చెరో స్కూటీ కొనిచ్చి తనో బైక్ కొనుక్కున్నాడు. వారానికోసారి షాపింగ్ వగైరా అంటూ తిరిగొస్తారు. ఇలా కొన్నాళ్ళు ప్రశాంతంగావున్న ఆ ఏరియాలో ఎలా వచ్చిపడ్డారోమరిగానీ, అంతా మాస్ఏరియాలా తయారైపోయింది.