ఒకానొకప్పుడు చంద్రపురం గ్రామంలో చలమయ్య అనే భాగ్యవంతుడు ఉండేవాడు. ఆయన భార్య రుక్మిణి రూపంలో, గుణంలో, శీలంలో పురాణస్త్రీలకు సాటిగలదని చెప్పుకునేవారు. ఆ దంపతులిద్దరూ దయాగుణానికీ, పరోపకారానికీ కూడా పేరుపొందారు.

చలమయ్య దంపతులకు చాలాకాలం వరకూ బిడ్డలులేరు. ఎన్నో నోములు నోచి, ఎన్నో పూజలు చేయగా చిట్టచివరకు భగవంతుడి అనుగ్రహంవల్ల వారికికలిగిన బిడ్డడే సర్వమిత్రుడు. చిన్నతనంనుంచీ బుద్ధిమంతుడని పేరు తెచ్చుకున్నాడు. శ్రద్ధగా చదివి అన్నివిద్యలూ నేర్చుకున్నాడు. దయాగుణంలో, పరోపకారంలో తండ్రిని మించిన కొడుకని పేరు తెచ్చుకున్నాడు. ఐతే, చలమయ్యకు కొడుకు గురించి బెంగగానే ఉండేది. సర్వమిత్రుడికి పరోపకారం మినహా మరో ఆలోచన ఉండేది కాదు. అతడు తనకు తెలిసిన విద్యలన్నింటినీ పరోపకారానికే తప్ప ధనార్జనకి ఉపయోగించేవాడు కాదు.‘‘నాయనా! నీ పద్ధతి సరికాదు. డబ్బు ఖర్చు చేసేటప్పుడు, సంపాదన గురించి కూడా ఆలోచించడం అవసరం’’’ అని చలమయ్య అతడికి హితవు చెప్పాడు.

దానికి సర్వమిత్రుడు నవ్వి, ‘‘ఇప్పటికే నువ్వు చాలా ఆర్జించావు. ఇంకా నేను కూడా ఆర్జించి మన ఆస్తిని పెంచాల్సిన అవసరం లేదని నా ఉద్దేశ్యం’’ అన్నాడు.‘‘కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. నేను సంపాదించిందంతా ఐపోయాక నువ్వేం చేస్తావు?’’ అన్నాడు చలమయ్య. ‘‘నారు పోసినవాడు నీరు పోయకపోతాడా? అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. నువ్వేమీ బాధపడకు’’ అని తండ్రికి బదులిచ్చాడు సర్వమిత్రుడు. కానీ ఖర్చుల విషయంలో చలమయ్య కొడుకుని పలుమార్లు స్వయంగా హెచ్చరిస్తూనే ఉన్నాడు. భార్యచేత, బంధువుల చేత కూడా హితవు చెప్పించాడు. అతడి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. సర్వమిత్రుడిలో ఏ మార్పూ రాలేదు.