అవసరానుగుణంగా నదులన్నీ ఏకమవుతున్నట్టే, మనుగడకోసం సంస్కృతులన్నీ కలగాపులగమైపోతున్నాయి. అభిప్రాయాలు మారిపోతున్నాయి. కొత్త విలువలు ఆవిష్కృతమవుతున్నాయి. దీంతో కొందరు తీవ్రంగా నలిగిపోతూ విలువలకు తూట్లు పడుతున్నాయని ఖేదపడుతున్నారు. కొందరు కాలం మారిపోయిందంటుంటే, మరికొందరు మారింది కాలంకాదు, మనుషులే అంటున్నారు!! ఏది నిజం? ఏది అబద్ధం?
సూర్యోదయమైంది.భాస్కరశర్మ సంధ్యావందనం సంపూర్ణం చేసుకుని బయటకువచ్చి సూర్యునికి అంజలిఘటించి అరుగుమీద కూర్చోబోతుండగా, కళ్ళు నులుముకుంటూ బయటకువచ్చాడు కొడుకు శ్రీనివాసశర్మ. ‘‘నాన్నా, సూర్యుడు పైకిరాకముందే నేను లేచాను తెలుసా! చెల్లే ఇంకా లేవలేదు’’ అన్నాడు నేనే ముందన్నట్లుగా.‘‘అవునా! మరి చెల్లినిలేపు. అది తయారై స్కూల్కు వెళ్ళాలిగా’’ అన్నాడు కొడుకువైపు ఆప్యాయంగా చూస్తూ.‘‘నాన్నోయ్ మర్చిపోయా స్కూల్లో ఫీజ్ కట్టాలి. సారు నిన్ననే చెప్పారు ఇవాళ్ళ కట్టమని’’‘‘అలాగా మరి రాత్రి చెప్పలేదేం?’’‘‘అమ్మకు చెప్పాగా. దేవుడి తోడు’’ అంటూ ‘‘అమ్మా....అమ్మా’’ అని గట్టిగా కేకపెట్టాడు శ్రీనివాసశర్మ.‘‘ఎందుకురా పొద్దున్నే అంతచేటు అరుస్తున్నావ్, వైదేహి జడుసుకుంటుంది. ఏమండోయ్ మన పిల్లల ఫీజులు...’’ లోపల్నుండి అరుస్తూ బయటకు వచ్చింది గాయత్రి. ‘‘తెలుసు వాడు ఇప్పుడే చెప్పాడు. చేతిలో చూసుకోవాలిగా. ఏదో చేసి ఇద్దరి ఫీజూ కట్టేస్తాలేగానీ ఏంటా ఫీజులు దిమ్మదిరిగిపోయేట్లు’’ అన్నాడు. ‘‘కాన్వెంట్లో వేస్తిమి. తప్పదుమరి.
మామూలు స్కూళ్ళకీ వీటికీ తేడాలుంటాయిగా!’’‘‘బ్రతుకుదెరువుకోసం ఈ చదువులు అవసరమే. కానీ ఈ లోపల మనకు కూసాలు దిగుతున్నాయి’’.‘‘పోనీ వేదం చెప్పించలేకపోయారా?’’ దీర్ఘం తీసింది గాయత్రి.‘‘ఎందుకీదెప్పుళ్ళు. వేదం చదువుకుని ఏ గుళ్ళోనో అర్చకత్వం చేసుకుంటూ బతికే మొగపిల్లలకు పెళ్ళిళౌతాయా? నాకు నీ సంబంధం మీవాళ్ళు ఖాయంచేయడానికి ఆరోజుల్లోనే ఆరునెల్లు వెనకాముందులాడారు!’’‘‘ఇహ నా సంగతే చెప్పాలి. అయ్యో! నా రాతా అని! నేను ఇంటర్ పూర్తిచేసి డిగ్రీచేద్దామను కుంటున్న రోజుల్లో మీ సంబంధం వచ్చింది. ఇంక చెప్పేదేముంది’’ అని నిట్టూరుస్తూ తులసిచెట్టుకు నమస్కారం చేసింది గాయత్రి.‘‘పొద్దున్నే ఆ రామాయణం ఎందుకులేగానీ గొంతులో కాస్త వేడినీళ్ళు పోస్తావా లేదా’’ కొడుకువైపు తిరిగి ‘‘పోరా.. పోయి స్నానంచెయ్యి’’ అన్నాడు భాస్కరశర్మ.గాయత్రి ఉద్దరణి, పళ్ళెం కడిగి చేతిలోకి తీసుకుని లోపలికిపోబోతూ ‘‘ఉన్నమాటంటే ఎంతవుడుకో. పులిహోరా దద్దోజనమేగా నా బతుకంతా’’ అంటూ సణుక్కుంది.