కాశీ రాజ్యాన్ని బ్రహ్మదత్తుడు పాలిస్తున్న రోజుల్లో బోధిసత్వుడు వ్యాపారం చేస్తూ ఉండేవాడు. తన వద్ద ఉన్న ఐదు వందల బళ్లలో కాశీ రాజ్యంలో దొరికే సరుకులు నింపి వాటిని సుదూర ప్రాంతాలకు తీసుకువెళ్లి అమ్మేవాడు. అక్కడ దొరికే సరుకులు తీసుకువచ్చి కాశీలో విక్రయించేవాడు. బోధిసత్వుడు వ్యాపారం లాభసాటిగా సాగుతోందని గ్రహించి ఒక వ్యాపారి తాను కూడా బళ్ల మీద సరుకులు దూర ప్రాంతాలకు తీసుకువెళ్లి విక్రయించాలనుకున్నాడు. ఐదు వందల బళ్లలో సరుకులు నింపించడం మొదలుపెట్టాడు.ఈ వార్త తెలిసిన బోధిసత్వుడు ఆ వ్యాపారికి కబురు పెట్టి- ‘‘వెయ్యి బళ్లు ఒకే సారి బయలుదేరితే పశువులకు దాణా దొరకదు. నీళ్లు లభించటం కష్టమవుతుంది. పనివాళ్లు తినటానికి కూరలు కూడా దొరకవు. వ్యాపారం జరగడం కూడా కష్టమే. అందువల్ల ఒకరు బయలుదేరిన నెల రోజులకు మరొకరం బయలుదేరుదాం’’ అన్నాడు.వ్యాపారి బాగా ఆలోచించి తానే ముందు బయలుదేరుతానన్నాడు. ముందు వెళితే తన వస్తువులకు గిరాకీ బాగా ఉంటుందని.. పశువులకు మంచి పచ్చిక దొరుకుతుందనేది ఆ వ్యాపారి ఆశ.

బోధిసత్వుడికి కూడా ఈ ఆలోచన బాగా నచ్చింది. తన బళ్లు ఆలస్యంగా బయలుదేరితే- పశువులకు ముదురుగడ్డి కాకుండా పచ్చగడ్డి దొరుకుతుందని, వస్తువులకు ధరలు నిర్ణయించటం కష్టం కాబట్టి, వ్యాపారి నిర్ణయించిన ధరలకే తన సరుకులు విక్రయించవచ్చనేది బోధిసత్వుడి ఆలోచన.ముందుగా అనుకున్నట్లు వ్యాపారి తన ప్రయాణం ప్రారంభించాడు. మార్గమధ్యంలో ఒక నిర్జనమైన ఎడారి ప్రదేశం ఉందని కొందరు చెప్పటంతో.. అతను తన బళ్లలో నీరు, ఆహార పదార్థాలు కూడా తీసుకువెళ్లాడు. కొద్ది దూరం గడిచేసరికి.. వారికి ఒక గుంపు కనిపించింది. వారందరూ బాగా తడిసి ఉన్నారు. తలకు కలువలు చుట్టుకుని ఉన్నారు. చేతిలో తామర తూడులు ఉన్నాయి.వారిని చూసి వ్యాపారి- ‘ముందు అంతా నిర్జన ప్రదేశమన్నారు కదా.. మీకు నీళ్లు ఎక్కడ దొరికాయి?’ అని అడిగాడు.అప్పుడు ఆ గుంపు నాయకుడు నవ్వి- ‘మీరు కొద్దిగా ముందుకు వెళితే అక్కడ కొన్ని తటాకాలు కనిపిస్తాయి. వాటి నిండా తామరపూలే. పైగా అక్కడ వాన పడుతోంది..’ అన్నాడు.