‘‘అస్సలాము అలైకుమ్‌.’’‘‘వా అలైకుమ్‌ అస్సలాం. వరహమతుల్లాహి వబరకాతహు’’ అంటూ, ఒక్కక్షణం మనిషిని ఎగాదిగా చూచి ‘‘అరే! మీరా! లోపలికి రండి భాయ్‌!’’ వాకిలి రెండవ రెక్కకూడా తెరిచాడు అబ్దుల్‌ రహమాన్‌.వచ్చిన వ్యక్తిని హాల్లో ఉన్న సోఫాలో కూర్చోబెట్టి గబాగబా లోపలికి పోయి భార్యతో గుసగుసలాడి తిరిగొచ్చి అతని యెదురుగా కుర్చీలోకూర్చున్నాడు నింపాదిగా. 

‘‘అదికాదు ముస్తఫా భాయ్‌, మీరొస్తున్నట్లు ఫోన్‌లో ఒక్కమాట చెప్పివుంటే బస్టాండుకు కారు పంపేవాన్ని కదా! మా ఇల్లు కనుక్కోవడానికి ఎన్నితంటాలు పడ్డారో ఏమో!’’‘‘లేదు రహమాన్‌ భాయ్‌, కడపలో నా స్నేహితుడున్నాడు. అతను నా కొలీగ్‌. ఈమధ్య ఆరోగ్యం బాగలేదని తెలిసి చూసి పోదామని వచ్చాను. ఎటూ వచ్చాను కదా.. మిమ్మల్ని కూడా చూద్దామని ...’’ మాట దిగమింగాడు ముస్తఫా.‘‘మంచిపని చేశారు. అన్నట్లు మీ భార్యను కూడా పిలుచుకొచ్చింటే బాగుండేది. ఆమె కూడా మా యిల్లు చూసినట్లయ్యేది. అయినా ఈ ఇంట్లో సంసారం చేస్తున్నామా ఏమి? పెండ్లికి ముందే కొత్త యిల్లు తయారవుతుంది. అక్కడికి షిప్టు అవుతాం’’ అన్నాడు అబ్దుల్‌ రహమాన్‌ ఆడంబరంగా.ట్రేలో ‘చా’ కెటిల్‌, బిస్కట్లు తెచ్చి టీపాయ్‌ మీద పెట్టాడు ఒక అబ్బాయి.

అబ్దుల్‌ రహమాన్‌ టీపాయ్‌ని ముస్తఫా దగ్గరికి జరుపుతూ ‘బిస్కెట్లు తీసుకోండి’ అన్నట్లు చేత్తో సైగ చేశాడు.‘‘ముస్తఫా భాయ్‌ .. మా బేగం, కొడుకు పెండ్లి కొత్త యింట్లోనే చేయాలని చాలా పట్టుదలగా ఉంది. మా బంధువుల్లో చాలామంది పెద్ద షావుకార్లు, బడా ఉద్యోగాలు చేసేవాళ్ళున్నారు. వాళ్ళందరు ఔరా .. అని ముక్కున వేలేసుకునేట్లు ఉండాలంటుంది. తొందరగా యిల్లు పూర్తిచేయమని రోజూ ఒకే సతాయింపనుకోండి. రెండు మూడు నెలల్లో పూర్తిచేస్తాను. చూడండి భాయ్‌, అప్పటికప్పుడు పెండ్లి నిశ్చయం చేసుకుంటే పిల్లలకు శెలవు దొరకొద్దూ! మొన్న మీ అమ్మాయిని చూడ్డానికి వచ్చినప్పుడు మా వాడన్నాడూ - సెలవుకు అప్లై చేసుకోవడానికని, రొన్నెళ్ళ ముందే డేట్‌ నిశ్చయించమన్నాడు. అమ్మాయి, మావాడు ఇద్దరూ ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు కాబట్టి పెద్ద ఇబ్బందేమీ ఉండదంట లెండి. ఎటూ మీరిప్పుడు వొచ్చారు గదా, పదిరోజులు అటో ఇటో ఫలానా రోజు అనుకుంటే బాగుంటుంది భాయ్‌’’ అన్నాడు అబ్దుల్‌ రహమాన్‌.