రకరకాల జనాలతో సూపర్‌ మార్కెట్‌ కళకళలాడుతోంది. కొన్నేళ్లుగా ఈ మార్కెట్‌కి ప్రతి ఆదివారం ఇలా రావటం అలవాటయ్యింది నాకు.‘‘మార్కెట్‌కి వెళ్లి ఆ దుమ్ము, ధూళిలో కష్టపడి నువ్వు కొనవలసిన అవసరం లేదు. కాస్త ధర ఎక్కువైనా ఫరవాలేదు. సూపర్‌మార్కెట్‌లో కొనేసెయ్యి’’ ఓ ఆర్డర్‌ జారీ చేసినట్లే చెప్పాడు అప్పట్లో విజయ్‌. ఏదీ అంత పట్టనట్లుండే విజయ్‌ నా మీద ప్రేమతో అలా కమాండ్‌గా చెప్పటం నా మనసును కదిలించింది. అప్పుడు అవసరం కొద్దీ వచ్చాను. ఇప్పుడు రాకుండా ఉండలేని పరిస్థితి. ఏదో వైరాగ్యం. పట్టుమని ఐదు పదులు కూడా నిండని వయసులో వైరాగ్యం. ఒంటరితనమే కారణం. విజయ్‌ విదేశాలకు వెళ్ళిన తరువాత నా ఒంటరితనంతో పోరాడటంలో ఈ మార్కెట్‌ కాలక్షేపం కూడా ఓ ఆయుధం అయిపోయింది. అందులో స్కూల్‌కి పది రోజులు క్రిస్మస్‌ సెలవులు ఇవ్వటంతో మరీ బోర్‌ కొడుతోంది. లేకపోతే స్కూల్‌, పిల్లలతో పొద్దుబానే గడిచిపోతుంది.కావలసినవి కొనుక్కుని పుడ్‌కోర్ట్‌లోకి నడిచాను.

‘‘మార్నింగ్‌ మేడం కోల్డ్‌ కాఫీయే కదా’’ అని చిరునవ్వుతో ఓసారి ఫార్మల్‌గా అడిగి కన్ఫామ్‌ చేసుకుని కాఫీ తేవటానికి వెళ్ళాడు వెయిటర్‌.‘‘ఛీ, కాఫీ చల్లగా ఉంది. తాగలేము’’ అన్న ఒకప్పటి మనుష్యులు ‘కోల్డ్‌ కాఫీ చాలా ఇష్టం’ అనే స్థితికివచ్చారు. దానికి కారణం కాఫీలో లేదు. ఇష్టాయిష్టాల అనేవి మనం ఏర్పరుచుకున్న భావాలు. మన మనసు చేసే మ్యూజిక్‌. కష్టసుఖాలు కూడా అంతేనా? వాటిలో సాంద్రత కన్నా మనం చేసే దృక్పథాన్ని పట్టే అవి కూడా ఉంటాయా?‘‘ఏంటి, మేడం ఏదో సీరియస్‌గా ఆలోచిస్తున్నారు’’ అడిగాడు వెయిటర్‌ కోల్డ్‌ కాఫీ తెచ్చి టేబుల్‌ మీద పెడుతూ.

తను అంత బిజీగా ఉంటూ కూడా నన్ను అడిగాడంటే, ‘అవకాశ మెస్తే చాలు నేను ఆలోచనలో కూరుకుపోవటం’ తనకు కూడా తెలుస్తోందా లేదా ఎన్నో ఏళ్ళగా చూస్తున్న నా పట్ల ఓ అభిమానమా! ఓ చిరునువ్వు సమాధానంగా ఇచ్చాను. అంత కన్నా ఆశించినట్లు తన పనిలోకి వెళ్ళిపోయాడు. చుట్టూత పరికిస్తూ ఒక్కొక్క గుటక ఆస్వాదిస్తున్నాను.