ప్రేమ స్వేచ్ఛను కోరుతుంది. కానీ, ప్రేమ స్వేచ్ఛను అదుపు కూడా చేస్తుంది. చిన్నప్పటినుంచీ స్వేచ్ఛను సాధించడమే ధ్యేయంగా పెట్టుకున్న నాకు, ప్రేమ–స్వేచ్ఛల మధ్య ఈ విచిత్రానుబంధం స్వానుభవంలోకి వచ్చే రోజొకటుండొచ్చని ఎప్పుడూ అనుకోలేదు.ఆ రోజు....

చీకటి నుంచి స్వేచ్ఛను ప్రసాదించడానికి సూర్యుడు తూర్పున ఉదయించాడు.ఇక నిద్రపోయే స్వేచ్ఛ నీకు లేదంటూ అమ్మ నన్ను తట్టి లేపింది.బీటెక్‌ మూడో సంవత్సరం సగంలో ఉన్న నేను, ప్రతి ఆదివారమూ ఎంతసేపైనా నిద్రపోయే స్వేచ్ఛని వరంగాపొందాను. ఆ వరాన్ని ప్రసాదించిందీ, అమలుజరిపే బాధ్యత తీసుకున్నదీ కూడా అమ్మే! కానీ ఆదివారమైనా కూడా అమ్మే నన్ను నిద్రలేపింది. నేను కూడా విసుక్కోకుండా నిద్ర లేచాను. కారణం , ఆ రోజు నా పుట్టినరోజు.మామూలుగా అయితే పుట్టినరోజు అనగానే పెందరాళే లేవాలి. తలంటు స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకోవాలి. ముందు దేవుడికీ, తర్వాత అమ్మానాన్నలకీ దణ్ణాలు పెట్టాలి. అమ్మ చేసిన పిండివంటలు తినాలి. నాన్న కొనిచ్చిన గిఫ్ట్‌ తీసుకోవాలి.

అక్క, బావ, అమ్మమ్మ, బామ్మ, తాతల ఫోన్లకి రెస్పాండవాలి. ఆ రోజు సెలవైతే అంతా కలిసి సరదగా గడుపుతాం. నాకు కాలేజీ ఉంటే కనుక సాయంత్రం పెందరాళే ఇంటికొస్తాను. అందరం ముందు గుడికీ, తర్వాత సినిమాకీ వెడతాం.కానీ ఈసారి వేరు. నాకు పంతొమ్మిది నిండాయి. టీనేజికి స్వస్తి చెబుతూ, ఇరవయ్యోపడిలో అడుగుపెడుతున్న సందర్భమది. టీనేజ్‌ అంటే స్వేచ్ఛకు మారుపేరు కాబట్టి, టీనేజీలో నా చివరి పుట్టినరోజు వేడుకను వేరెవరి ప్రమేయమూలేకుండా, నాకు నేనుగా జరుపుకునే స్వేచ్ఛ కావాలన్నాను. ఇంట్లోవాళ్లు సరేనన్నారు.