ఒకానొకప్పుడు శ్రీపురం గ్రామంలో శివశర్మ అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు.ఆయన తండ్రి వేదశర్మకు ఉన్నట్లుండి జబ్బు చేసింది. వైద్యుడు ఆయనకు రకరకాల మందులిచ్చి చూశాడు. దేనికీ ఆ జబ్బు నయం కాలేదు. దాంతో వైద్యుడు శివశర్మతో, ‘‘అయ్యా! అసలే పేదరికంతో బాధపడుతున్న తమరు వైద్యం గురించి డబ్బు వృధాచేయకండి. నేను చాలా మంచిమందులే వాడాను. అవి పనిచేయలేదంటే ఇది శరీరదోషంకాక గ్రహదోషమై ఉంటుంది’’ అని చెప్పాడు. గ్రహదోషం అని చెప్పడంతో శివశర్మ, తన తండ్రి జాతకాన్ని ఆ ఊళ్లో పేరుమోసిన జోతిష్యుడికి చూపించాడు.

ఆయన జాతకాన్ని కూలంకషంగా పరిశీలించిన జ్యోతిష్యుడు, ‘‘నీ తండ్రికి వారసత్వంగా బోలెడు ఆస్తి వచ్చింది. వారసత్వ ఆస్తి కాబట్టి ఆయన దానిని జాగ్రత్తగా కాపాడి నీకు అప్పగించాల్సి ఉంది. కానీ డబ్బుని స్వార్థానికీ, విలాసాలకూ ఖర్చు చేశాడు. నిన్ను పెంచిపెద్దచేయడంలో ఏ మాత్రం శ్రద్ధ చూపించకుండా తన సుఖం తాను చూసుకున్నాడు. తన హయాంలో ఒక్క దానం కూడా చేయలేదు. అందువల్ల ఇప్పుడు ఆయనకు నీమీద ఆధారపడి బ్రతికే హక్కు లేదు. లేనిహక్కుని అనుభవించడం ఆయనకు శాపంలా పరిణమించింది. అందుకే ఆయనకిలా అనారోగ్యం వచ్చింది. ఆయనకింకా నలభైఏళ్ల ఆయుర్దాయం ఉంది. అంతకాలంపాటు ఆయన ఇలాగే బాధ పడక తప్పదు’’ అని చెప్పాడు జోతిష్యుడు.

ఇది విని శివశర్మ ఎంతో నొచ్చుకుని, ‘‘తండ్రి నాకేదో ఇచ్చాడనీ, చేశాడనీ నేను ఆయనకు సేవలు చేయడం లేదు. ఆయన నాకేమీ ఇవ్వలేదని నేను ఆయన్ను నిరసనగా చూడాలనుకోలేదు. అలాచేస్తే అది తండ్రీ కొడుకుల అనుబంధం కాకుండా, వ్యాపారబుద్ధి అవుతుంది. నా అభిప్రాయంలో తండ్రీకొడుకుల సంబంధం ఎంతో పవిత్రమైనది. నాకు నా తండ్రిపై ఎటువంటి ద్వేషమూలేదు. నేను ఆయన్ను ఇష్టపడి మనస్ఫూర్తిగా సేవించుకుంటున్నాను. ఆయన సుఖసంతోషాలతో ఆరోగ్యంగా జీవించాలనేదే నా కోరిక. అందుకు నా వల్లయ్యే మార్గమేదైనా ఉంటే చెప్పండి, అనుసరిస్తాను’’ అన్నాడు శివశర్మ.