వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. అపార్థాలు, కొన్ని పరిస్థితులు, కొందరి స్వప్రయోజనాలు వారిమధ్యకొచ్చాయి. ఆమెకు అతడు మొహం చాటేశాడు. కానీ అతడికోసం ఆమె అన్వేషణ కొనసాగించింది. సమయం పట్టినాగానీ, అతని మనసుజాడ కనిపెట్టగలిగిందామె. ప్రేమంటే భౌతిక అవసరాలు తీర్చే భావజాలం కాదని ఆమె విశ్వాసం. దానికే కట్టుబడింది. అందుకే ఆమె ఏం చేస్తోందంటే....

‘సారీ!’అసలీ శబ్దానికేమైనా అర్థముందా? సారీ అట సారీ. ఎంతమోసం? ఇది తన బాధకు ఏ విధంగానైనా ఉపశమనం కలిగిస్తుందా? తనకు ప్రపోజ్‌ చేసిన ప్రభాతేనా అతను? అతనింత కఠోరంగా ఎలా మారగలిగాడు? తనపట్ల అతనికి విముఖత కలగడానికి కారణం ఏంటి? అతను చూపిన ప్రేమ, అనురాగాలను ఏ కాకి ఎత్తుకుపోయింది? తొలుత తను అతనిపట్ల కాస్త ఉదాసీనంగా ఉన్నమాట నిజమే. కాని అతను? తన సహజ సంభాషణా చాతుర్యంతో, హాస్యోక్తులతో ఆకట్టుకున్నాడు. కానీ ఇప్పుడు? అకస్మాత్తుగా తనని మరచిపొమ్మంటున్నాడు. అది కూడా తను అతని ప్రస్తావనకు సానుకూలంగా స్పందించిన తర్వాత! తమ పెళ్ళి ఏర్పాట్లవిషయమై మాట్లాడుకుందామన్నప్పుడు! అతని ప్రస్తావనకు సంబంధించి తన నిర్ణయం తెలుపడంలో మూడువారాలు జాప్యం జరిగింది నిజమే కానీ, దాంతో, అతను తన మనసు మార్చుకుని మొదటికే ఎసరు పెట్టడం సబబేనా? ఆ ఆలస్యానికి తన కారణాలు తనకున్నాయి.

ఏమైతేనేం చివరకు తన అంగీకారం తెలిపింది కదా? ఇప్పుడు తనను మరచిపొమ్మడం ఎంత అమానుషం? ఇన్నిసంవత్సరాల తమ సాన్నిహిత్యాన్ని మరచిపోవడం అతను ‘సారీ’ అన్నంత సులువా?ప్రశ్నలు, ప్రశ్నలు, ప్రశ్నలు, కాని జవాబుల జాడ, దరిదాపుల్లో లేదు. విభ మనసు గతం వైపు పరుగుతీసింది. అది కాలేజీలో తన మొదటిరోజు. కొందరు సీనియర్లు ర్యాగింగ్‌ చేయడం మొదలుపెట్టారు. ఏవోవో విన్యాసాలు చేయమని బలవంతపెట్టారు. తను చేసింది. వారింకారెచ్చిపోయి ఇంకొన్ని మొరటుపనులు చేయమన్నారు. తనకు ఏడుపొచ్చింది. వారి కళ్ళలో పైశాచికానందం. తనకు దిక్కు తోచలేదు. కళ్ళల్లో నీళ్ళు నిండుగా కాసేపు అలాగే నిలబడింది. వారు తన దగ్గరికి రాసాగారు.

అప్పుడు ఓ అద్భుతం జరిగింది. అప్పటివరకు వారిలోనే ఉన్న ప్రభాత్‌, ఒక్కసారిగా ఎగిరి తనకు, వారికి మధ్యలోకి వచ్చి నిలిచాడు. ఆజానుబాహుడైన ప్రభాత్‌ జోక్యం చేసుకోవడంతో వారు వెనుకంజ వేశారు. ‘‘నీకది ఏమౌతుంది’’ అని అడిగారు. ‘‘దానికి నీకు అక్రమ సంబంధం ఉందా?’’ అని ప్రశ్నించారు. ప్రభాత్‌ను నానా మాటలని, అతన్ని తర్వాత చూస్తామని బెదిరిస్తూ నిష్క్రమించారు. ప్రభాత్‌ తొణకలేదు. బెణకలేదు. అంతేకాదు. అంతటితో ఆ అల్లరిమూకతో తన సంబంధం తెంచుకున్నాడు.