విడదీయరాని ప్రేమలోకంలో యాభైఏళ్ళ సాహచర్యంవారిది. డెబ్భై ఏళ్ళు దాటిన వయసులో కూడా వారిది అనిర్వచనీయమైన అనుబంధం. వాట్సప్పులు, ఛాటింగులతో ప్రపంచంతో కనెక్టై ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. అలాంటి జంట ఆకస్మికంగా ఆసుపత్రిపాలైంది. ఆమెకోసం అతడు ప్రాణాలు ఉగ్గబట్టుకున్నాడు. ఆమెమాత్రం ఇంకా స్పృహలోకి రాలేదు. డాక్టర్లదేమో వెయిట్ అండ్ సీ పాలసీ. కానీ ఇంతలో ఏంజరిగిందంటే....
సాయంత్రం ఏడున్నర అయింది.అప్పటివరకు భానుడిధాటికి భయపడిదాక్కున్న చీకట్లు ఆవురావురుమంటూ, ఆ హాస్పిటల్‌ను ముట్టడించాయి.నీడలు భయంకరంగా, చాలాపొడవుగా పెరిగి, ఏదో అకృత్యం చూడ్డానికి ఆతృతగా హాస్పిటల్ కారిడార్ అంతా పరుచుకుంటున్నాయి.ఐసీయూ వార్డు నిశ్శబ్దంగా ఉంది. మామూలు నిశ్శబ్దం కాదు. నీరవ నిశ్శబ్దం.ఒకవిధంగా శ్మశానవైరాగ్యం తెరలు తెరలుగా అక్కడి వాతావరణాన్ని కమ్మేసింది.జీవితంలో కొన్నిచోట్లకు పోకూడదు. మరీముఖ్యంగా ఐసీయూ దరిదాపులకు అస్సలు పోవద్దు.ఐసీయూవార్డులో చేరడమంటే అనంత ప్రయాణానికి బుక్‌చేసుకున్న టికెట్ కన్ఫర్మ్ కాకుండా ఆర్.ఏ.సీ లిస్టులో ఉన్నట్టే. ఆర్.ఏ.సీ లిస్టులో ఉన్న టికెట్ కన్ఫర్మ్ అయితే, తాత్కాలిక గమ్యం వైపు ప్రయాణం మొదలవుతుంది.
ఐసీయూ లిస్టులో ఉన్న వ్యక్తి టికెట్ కన్ఫర్మ్ అయితే, ఎప్పుడో మొదలైన ప్రయాణం, ఆఖరిదశలో పాడెమీద సాగి, ఆగిపోతుంది. మా ఆయన ఐసీయూ బ్లాక్‌ముందు నిలబడి ఉన్నాడు.అతని గుండెల్లో, నిశ్శబ్దంగా అగ్నిగుండాలు రగులుతున్నాయి. ఆయన కన్నుల్లో, గుంభనంగా అనంత జలరాశులు పొంగుతున్నాయి.మస్తిష్కం నిస్తేజమైనట్టుగా, తన శరీరంలోనిశక్తినంత ఎవరో పనిగట్టుకుని తోడేసినట్టుగా, నీరసంగా, మౌనమునిలా నిలబడి ఉన్నాడు.నేను ఆయన పక్కనే నిలబడి ఉన్నాను. నా శరీరాన్ని, ఆయన శరీరానికి ఆనించి, ఆ స్పర్శ ద్వారా ఆయనకు కొంతబలం, కొంత సాంత్వన అందించాలని నా తాపత్రయం.
తల్లిదండ్రులిద్దరినీ ఐసీయూలో చేర్చారని తెలిశాక, మొన్న డల్లాస్‌లో బయల్దేరినప్పటినుంచి - ఆయనది అదేవాలకం. కన్నీళ్ళుకార్చరు, ఒక్కమాట మాట్లాడరు. తనలోని చైతన్యమంతా హరించుకుపోయినట్లు శిలావిగ్రహంలా మారిపోయారు.బహుశా, తన నిర్లక్ష్యంవల్లే ఇలా జరిగిందేమో అనేబాధ ఆయన్ను లోలోపలే తినేస్తున్నట్టుంది.మామగారికి హార్ట్‌ఎటాక్ వచ్చిందనే విషయం తెలియగానే అత్తగారికికూడా హార్ట్‌ఎటాక్ వచ్చింది. ఇద్దరినీ హాస్పిటల్లో చేర్చారు. మేము రాగానే, ఇద్దరికీ ఆపరేషన్లు జరిగాయి. నా భర్త కోరికమీద ఇద్దరినీ ఐసీయూలో ఒకే రూములో ఉంచారు.